Pawan Kalyan Home In Pithapuram : టీడీపీ మద్దతుతో ఈసారి పిఠాపురం నుంచి కచ్చితంగా గెలిచి తీరుతానని ధీమాగా ఉన్న పవన్.. తాను గెలిచాక తిరిగి హైదరాబాద్ వెళ్లిపోతానన్న ప్రత్యర్ధుల ప్రచారంపై ఫోకస్ పెట్టారు. దీంతో స్ధానికంగా ఉండేందుకు ఓ కొత్త ఇల్లు కొనుక్కున్నారు. పిఠాపురాన్ని స్వస్థలంగా మార్చుకుంటానని జనసేనాని ఇటీవల ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం.. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఎంపిక చేసుకున్న భవనానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. చేబ్రోలుకు చెందిన అభ్యుదయ రైతు ఓదూరి నాగేశ్వరరావు ఈ భవనాన్ని నిర్మించగా.. పార్టీ కార్యకలాపాల నిర్వహణ, వసతికి అనువుగా ఉండడంతో ఈ నివాసాన్ని ఎంపిక చేశారు.
చేబ్రోలులో కొత్త ఇంటిని పవన్ కళ్యాణ్ ఎంపిక చేసుకుని.. ఇక్కడే ఉగాది వేడుకలు జరుపుకోనున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు బైపాస్ రోడ్డు పక్కన తన పంటపొలాల్లో రైతు ఓదూరి నాగేశ్వరరావు మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు. ఈ భవనాన్ని పవన్ నివాసముండేందుకు ఎంపిక చేసుకున్నారు. జనసేనాని తన సొంతింటిని నిర్మించుకునే వరకూ ఇక్కడే ఉంటారు. ఇంటికి ఇప్పుడు తుది మెరుగులు దిద్దుతున్నారు. పిఠాపురాన్ని తన స్వస్థలంగా మార్చుకుంటానని ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారు. తాజాగా, పిఠాపురంలో ఆయన కొత్త ఇల్లు రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పవన్ కార్యాలయం, వసతికి అనువుగా చేబ్రోలులో ఓ భవంతి తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఉగాది రోజు పవన్ గృహ ప్రవేశం చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నట్లు సమాచారం. ఈ మూడంతస్తుల భవనం నుంచి పవన్ కల్యాణ్ ప్రచారం కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ – జనసేనతో పొత్తులో భాగంగా ఆయన పిఠాపురం నియోజకవర్గం ఎంచుకున్నారు. ఇక, అధికార వైసీపీ ఇక్కడ వంగా గీతను బరిలోకి దించింది. పెద్ద ఎత్తున మంత్రులు, కీలక నేతలను అక్కడ ప్రచారం కోసం మోహరించింది. అటు, అధికార వైసీపీ ఎన్ని చేసినా తాను పిఠాపురంలో గెలిచి తీరుతానని పవన్ కల్యాణ్ స్పష్టం చేస్తున్నారు. ఉగాది తర్వాత పవన్ కళ్యాణ్ ఈ ఇంటి నుండే తన రాజకీయ ప్రక్షాళన చేయనున్నారు.