Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏలూరు జిల్లాలో వారాహి విజయ యాత్ర రెండో విడత ప్రారంభించిన విషయం తెలిసిందే. ముందుగా ర్యాలీగా సభకి వెళ్లిన పవన్ కళ్యాణ్‌కి దారి ఎత్తున జనసైనికులు ఘన స్వాగతం పలికారు.సభలో మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శల వర్షం కురిపించారు. అయితే జనసేనాని ర్యాలీలో ఆసక్తికర సంఘటన జరిగింది. ఓ అభిమాని తన కూతురిని ఎత్తుకోమని పవన్‌కి ఇవ్వగా, ఆయన చిన్నారిని చాలా జాగ్రత్తగా తీసుకొని తిరిగి అంతే జాగ్రత్తగా చిన్నారి తల్లికి అప్పగించారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ చిన్నారి విషయంలో చూపిన జాగ్రత్త ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
వారాహి విజయయాత్ర రెండో దశ బహిరంగసభ ఆదివారం నగరంలో జరిగింది. ఈ సభలో మాట్లాడుతూ “హలో ఏపీ బైబై నినాదం అన్నది కేవలం సరదాగా ఇచ్చిన నినాదం కాదు. దాని వెనుక ఎంతో సంఘర్షణ, మథనం దాగున్నాయి అని అన్నారు పవన్. ఈ వైసీపీ ప్రభుత్వం 2024లో ఇంటికి వెళ్లకపోతే జరిగే వినాశనం అంతా ఇంతా కాదు. అందుకే ఎంతో ఆలోచించిన తర్వాతనే ఆ నినాదాన్ని నేను ఇచ్చాను అని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ పాలనలో జరుగుతున్న అన్యాయాలు, ప్రజాధనం కాపాడేందుకు, ప్రజల తరఫున జగన్ కు నేను సంధించే ప్రశ్నలు. వీటికి సూటిగా సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం లేకనే నా వ్యక్తిగత జీవితాన్ని విమర్శిస్తారు.
కనీసం ఇంట్లో నుంచి బయటకు రాని మా అమ్మను, నా భార్యను, పిల్లలను సైతం చెప్పలేని బాషలో తిడతారు. నేను ప్రజల కోసం అన్నీ పడతాను. కచ్చితంగా వీరిని వదలకుండా ప్రశ్నిస్తుంటాను అని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటి నుండి తాను జగన్‌ని ఏకవచనంతో సంబోధిస్తానని పవన్ అన్నారు.”రాష్ట్ర అభివృద్ధి చెందడం అంటే జగన్ కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబాలు అభివృద్ధి చెందడం కాదు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. కనీస మౌలిక వసతులు మెరుగవ్వాలి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలి అని పవన్ స్పష్టం చేశారు.