Pawan Kalyan : హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీసీ ఆత్మగౌరవ సభకు అతిధిగా పాల్గొన్న పవన్ కళ్యాణ్.. ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే ఆర్టికల్ 370, మహిళా రిజర్వేషన్ బిల్లు, ట్రిపుల్ తలాక్ బిల్లు తీసుకువచ్చే వారు కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. 2014 వరకు దేశంలో ఎన్ని ఉగ్రదాడులు జరిగాయో అందరికీ తెలుసని, మోదీ ప్రధాని అయ్యాక దేశంలో ఉగ్రదాడులను కట్టడి చేశారన్నారు. చంద్రయాన్-2 ఫెయిల్ అయినప్పుడు శాస్త్రవేత్తలను భుజం తట్టి… చంద్రయాన్-3 సక్సెస్ వైపు నడిపించారన్నారు. డిజిటల్ పేమెంట్స్ తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను మార్చేశారన్నారు. పీఎం కిసాన్, స్వచ్ఛ భారత్ వంటి ఎన్నో పథకాలను ప్రధాని మోదీ తీసుకువచ్చారని గుర్తుచేశారు.
సకల జనుల పోరాటంతో తెలంగాణ సాధించుకున్నామని, 4 కోట్ల మంది పోరాటం చేస్తేనే తెలంగాణా వచ్చిందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే నీరు-నిధులు-నియామకాలు అందరికీ అందుతున్నాయా అనేదే ఇక్కడ ప్రశ్న అని అభిప్రాయపడ్డారాయన. తెలంగాణలో మోదీ ఆధ్వర్యంలో బీసీ అధికారం సాకారం కావాలన్నారు పవన్ కళ్యాణ్. నోటితో చెప్పడం తేలికేనని.. చేయడం కష్టమని.. బీసీ ముఖ్యమంత్రిని బీజేపీ ప్రకటించడం గర్వించదగ్గ విషయమన్నారు. తెలంగాణ భాగవతం పుట్టిన నేల అని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ నేలలో బతుకు భారం అవ్వకూడదన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీసీలు తెలంగాణలో ఎదగాలన్నారు. ప్రధాని మోదీ బీసీలను సీఎం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అందుకు జనసేన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.
మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రసంగాలు విని స్ఫూర్తిపొందానన్నారు. ఇలాంటి వ్యక్తి ప్రధాని అయితే దేశం బాగుంటుందని భావించానన్నారు. ప్రధాని మోదీ అంటే తనకెంతో ఇష్టమైన నేత అన్నారు. మోదీని పెద్దన్న లాగా భావిస్తానన్నారు. తనకు ధైర్యం ఇచ్చి, రాజకీయాల్లో భుజం తట్టిన నాయకుడు మోదీ అని పవన్ గుర్తుచేసుకున్నారు. ఇలాంటి వ్యక్తి పక్కన కూర్చునే అవకాశం లభించినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. అయితే సభలలో సీరియస్‌గా ఉండే పవన్ ఈ సారి మాత్రం చాలా కూల్‌గా నవ్వుతూ కనిపించారు. మోదీ పక్కనే కూర్చొని ఆయనతో సీరియస్ డిస్కషన్ ఏదో చేశారు. బండి సంజయ్, అరవింద్ వంటి వారితో జోకులు వేసుకుంటూ తెగ సంతోషంగా ఉన్నట్టు కనిపించారు.