Pawan Kalyan : గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా వైసీపీ నాయకులపై దారుణమైన కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాలంటీర్స్ వ్యవస్థపై ఆయన సంచలన ఆరోపణలు చేస్తున్నారు.వైసీపీకి బైబై చెప్పాలంటే జనసేన వంటి బలమైన క్యాడర్ అవసరం అన్నారు. జగన్ గొప్ప నాయకుడైతే తనకు మించి సంతోషించే వారు ఎవరూ ఉండరన్నారు. వాలంటీర్ల జీతం 5వేలు మాత్రమేనని,వారి పొట్ట కొట్టాలని తనకు లేదని పవన్ అన్నారు. ఐదు వేల రూపాయలకు వాలంటీర్లను కట్టేస్తే అందులో ఓ ఇంజనీర్, శాస్త్రవేత్త కావాలనుకునే వారిని కట్టిపారేస్తున్నారని విమర్శించారు.
వారికి ఐదు వేలు ఇచ్చి ఊడిగం చేయించుకుంటున్నారన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే డబ్బుల్ని కూడా వాలంటీర్లకు ఇవ్వడం లేదన్నారు. పంచాయతీ, రెవెన్యూ వ్యవస్ధలతో పాటు రాజకీయ వ్యవస్ధల్ని కాదని ఐదు వేల చొప్పున ఇచ్చి నాలుగో వ్యవస్ధను జగన్ పెట్టారని పవన్ విమర్శించారు. వారిని జగన్ శ్రమదోపిడీ చేస్తున్నట్లే అన్నారు. రాజకీయాలపై తనకు స్పష్టమైన అవగాహని ఉందని అన్నారు. ఉపాధి హామి కూలీ చేసుకునేవారికంటే గ్రామ వాలంటీర్ల వేతనాలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. వాలంటీర్ల వ్యవస్థ లేనప్పుడు దేశం ఆగిపోయిందా.. ప్రజల వ్యక్తిగత సమాచారం అంతా వాలంటీర్ల దగ్గర ఉందని ఆరోపించారు.
వాలంటీర్లలో మహిళల గురించి తాను మాట్లాడటం లేదని, బ్యాచ్ లర్లకు డేటా సేకరణ బాధ్యత ఇచ్చారని, వారి దగ్గర కుటుంబాల డేటా చాలా ఉంటోందని పవన్ తెలిపారు. జగన్ వాలంటీర్ల వ్యవస్ధ మొదలుపెట్టినప్పుడు వారి ఉద్దేశం వేరై ఉండొచ్చని, కానీ సమాచారం అనేది చాలా సున్నితమన్నారు. గ్రామాల్లో తల్లితండ్రులు ఇళ్లలో లేనప్పుడు మహిళల సున్నితమైన డేటా తీసుకుంటున్నారని ఆరోపించారు. పంచాయతీరాజ్, రెవెన్యూ వ్యవస్ధలుండగా వాలంటీర్ల పేరుతో మరో సమాంతర వ్యవస్ధ ఎందుకన్నారు. ఇప్పుడు మీకు ఓ అన్నగా చెబుతున్నా. 5 వేలు ఇస్తే మరో పదివేలు ఇస్తాను. మీ పొట్ట కొట్టేవాడిని కాదు నేను . మీకు ఎప్పుడు అండగా ఉంటాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.