Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ అయిన విషయం తెలిసిందే. ఆయనని కలిసి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. తాను టీడీపీతో కలిసి పని చేస్తానని అన్నాడు. రానున్న ఎన్నికలలో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని పవన్ తెలియజేశారు. అయితే రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడుతో గురువారం పవన్ కల్యాణ్ బాలకృష్ణ, నారా లోకేశ్ తో కలిసి ములాఖత్ కాగా, జైలులో వీరు ముగ్గురు 40 నిమిషాల పాటు చంద్రబాబుతో పలు అంశాలపై చర్చించారు.
బయటకు వచ్చాక మాత్రం వైసీపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలానే జనసేన, తెదేపా కలిసి పనిచేస్తాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇవాళ్లి ములాఖత్ ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది. చంద్రబాబు పాలనపై విధానపరమైన అభిప్రాయ బేధాలు ఉండొచ్చు. కానీ చంద్రబాబు గురించి వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ మాట్లాడలేదని పవన్ అన్నారు. అయితే, జైలులో చంద్రబాబు భద్రతపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ విషయంపై మాట్లాడారు. చంద్రబాబు భద్రత విషయంపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరలోనే ఉంటున్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వద్దకు వెళ్లిన పవన్ ఆమెను పరామర్శించారు.
ఈ సమయంలో బాలకృష్ణ, నారా లోకేశ్, నారా బ్రాహ్మిణి ఉన్నారు. భువనేశ్వరితో ఆయన ఆప్యాయంగా మాట్లాడుతూ… అమ్మా.. ఎలా ఉన్నారని కుశల ప్రశ్నలు వేశారు. రాజకీయాలను పట్టించుకోని మీపై వైసీపీ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారని, అది తనను ఆవేదనకు గురి చేసిందని ఆమెతో చెప్పారు. శాసనసభలో కూడా మీపై వ్యాఖ్యలు చేస్తే తనకు ఎంతో బాధనిపించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో మరే మహిళకు ఇలాంటి ఇబ్బంది రాకూడదని, ఇలా చేయాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ చెప్పారు. చంద్రబాబు నాయుడు లోపల బాగానే ఉన్నారని భువనేశ్వరికి ఆయన భరోసా ఇచ్చారు. ఈ విషయంలో మీరు ఆందోళన చెందవద్దని పవన్ కల్యాణ్ ధైర్యం చెప్పారు. మీ ముఖంలో మళ్లీ చిరునవ్వు కనిపించేలా చేస్తామని, దీనికి కోసం అందరం కలిసి పని చేస్తామని ఆయన అన్నారు. క్లిష్ట సమయంలో తమకి అండగా నిలిచినందుకు జనసేన అధినేతకి కృతజ్ఞతలు తెలియజేశారు భువనేశ్వరి.