Pawan Kalyan And BJP : తెలంగాణలో ఏపాటి బలముందో లేదో తెలియదు గానీ ఈ సారి జనసేన మాత్రం పోటీకు సై అంటుంది. బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు ఆ పార్టీతో కలిసి పోటీ చేయాలని భావిస్తుందని కొందరు అంటుండగా , మరి కొందరు మాత్రం బీజేపీకి హ్యాండ్ ఇచ్చి టీడీపీతో కలిసి పోతుందని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ప్రధాన పార్టీలతోపాటు.. తెలంగాణ సమరంలో పోటీచేసేందుకు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన కూడా సిద్ధమవుతోంది.
32 స్థానాల్లో పోటీచేయనున్నట్లు తెలంగాణ జనసేన నేతలు ప్రకటించారు. ఈ క్రమంలో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకెళ్తున్న బీజేపీ.. ఏపీలోని మిత్ర పార్టీ జనసేనను కలుపుకుని.. ఎన్నికల సంగ్రామంలో తలపడేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అభ్యర్థుల ప్రకటనకు ముందు తెలంగాణలో జనసేనతో ఉమ్మడి పోటీ గురించి బీజేపీ నేతలు బుధవారం ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో చర్చలు జరిపారు. కాని చర్చల తర్వాత పవన్ అంత ఆసక్తి చూపినట్టు అనిపించడం లేదని అంటున్నారు. ఏపీలో అధికార పార్టీకి అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించి ఆ పార్టీ ద్వారా రాష్ట్రంలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని బలహీన పరచాలన్న బీజేపీ వ్యూహం బెడిసికొట్టిందని అంటున్నారు.
ఈ సారి జనసేన.. బీజేపీతో తెగదెంపులు చేసుకోవడానికైనా రెడీ కానీ పోటీకి దూరంగా ఉండే ప్రశక్తే లేదని బీజేపీకి తేల్చి చెప్పేశారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఏపీలో తన తీరుతో జనసేనను దూరం చేసుకున్న బీజేపీ తెలంగాణలో కూడా అదే అపరిపక్వ తీరుతో ఆ పార్టీకి దూరం అవుతోందని టాక్ వినిపిస్తుంది. ఈసారి నాయకులు పోటీ కోరుకుంటున్నారనే విషయం బయటకొచ్చింది. దానికి అధినాయకుడు సమాధానం కూడా విచిత్రంగానే ఉంది. పార్టీలో అంతర్గతంగా జరిగిన చర్చను బహిరంగ పరచడం విశేషం అనే చెప్పుకోవాలి. అంతే కాదు.. బీజేపీ, టీడీపీని పరోక్షంగా పవన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కూడా అనుకోవచ్చు.