Mudragada Photo : ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీ బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకుల అరాచకాలని ఒక్కొక్కటిగా బయటపెడుతూ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌పై నిప్పులు చెరిగారు. దీంతో ముద్రగడ పద్మనాభం సీన్‌లోకి వచ్చి పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మూడు పేజీల లేఖని ముద్రగడ విడుదల చేయగా, ఇందులో పలు అంశాలు ప్రస్తావించారు. దీంతో జన సైనికులు ముద్రగడని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో ముద్రగడ పద్మనాభం వర్సెస్ పవన్ కల్యాణ్ అన్నట్టుగా మారింది.
పవన్ టార్గెట్‌గా ముద్రగడ సంధించిన లేఖలు కల్లోలం రేపాయ్. పవన్… రౌడీ భాష మార్చుకో!, నీ అభిమానుల్ని కంట్రోల్‌లో పెట్టుకో! నీకు దమ్ముంటే నాపై పోటీ చెయ్! అంటూ సవాళ్లు విసిరారు. ముద్రగడ వైపు నుంచి ఘాటైన విమర్శలు వస్తున్నా నోరు మెదపని పవన్ కళ్యాణ్ మలికిపురం సభలో పాజిటివ్‌గా స్పందించడం ఆసక్తిని రేపుతుంది. మలికిపురం సభలో పవన్ మాట్లాడుతున్నప్పుడు కులద్రోహి అంటూ ముద్రగడకు వ్యతిరేకంగా బ్యానర్లు ప్రదర్శించడంతో పవన్ రియాక్టయ్యారు. వెంటనే ఆ బ్యానర్లను తీసేయాలని సూచించారు. పెద్దలేదో అంటుంటారు!, మనం తీసుకోవాలి అంతే!, ఇలాంటివి మాత్రం వద్దన్నారు! దాంతో, ముద్రగడకు వ్యతిరేకంగా పెట్టిన ప్లకార్డులు, బ్యానర్లను తీసేశారు కార్యకర్తలు.
ముద్రగడ కామెంట్స్‌కి పవన్ కళ్యాణ్ ఇంత సానుకూలంగా స్పందించడంతో ఆయన వెనక్కి తగ్గుతాడా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక మలికిపురం సభలో మాట్లాడిన పవన్ కోనసీమని అద్భుతమైన టూరిజంగా డెవలప్ చేస్తానని అన్నారు. 2024లో మళ్లీ వైసీపీ గెలిచే ఛాన్సే లేదన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవకుండా చేస్తానని శపథం చేశారు పవన్. కేవలం విమర్శలే కాకుండా జనసేన అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెప్పుకొచ్చారు పవన్. విద్య, వైద్యం, ఉపాధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇప్పటివరకు జరిగిన సభలతో పోల్చితే మలికిపురంలో భిన్నంగా మాట్లాడారు పవన్ కల్యాణ్. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే, జనసేన అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెప్పే ప్రయత్నం చేశారు.