Pavitra Lokesh : గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్రా లోకేష్ వ్యవహారం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరు చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మధ్య పవిత్రపై చేతులేస్తూ మాట్లాడిన నరేష్.. కృష్ణ అంత్య క్రియల సమయంలో ఆమెను అందరికి పరిచయం చేయడం, చేతులేస్తూ తిరగడం వంటివి చేశారు. ఈ క్రమంలో నరేష్, పవిత్రలని తెగ ట్రోల్ చేస్తున్నారు. నరేష్, తనపై కొన్ని యూట్యూబ్ ఛానెళ్లలో అభ్యంతరకర వీడియోలు పెడుతున్నారని.. వాటి వల్ల తమ పరువుకు భంగం కలుగుతోందని పవిత్రా లోకేష్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించింది.
యూట్యూబ్ ఛానెళ్లపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు పవిత్రా లోకేష్ ఫిర్యాదు చేశారు. తమపై అసభ్యకర, అభ్యంతరకర వీడియోలు పోస్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ల వెనుక నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఉన్నట్లుగా పవిత్రా లోకేష్ అనుమానం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. . ఈ మేరకు పవిత్ర తన ఫిర్యాదులో రామారావు, శివకుమారి, రమ్య రఘుపతి పేర్లను పేర్కొన్నారు. పవిత్రా లోకేష్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ కొనసాగిస్తున్నామని ఏసీపీ ప్రసాద్ వెల్లడించారు. ముగ్గురు పేర్లను పవిత్ర తన ఫిర్యాదులో పేర్కొన్నారని.. ఈ మేరకు సదరు యూట్యూబ్ ఛానెల్స్‌కు నోటిసులు కూడా ఇచ్చామని ఏసీపీ స్పష్టం చేశారు.
పలు యూట్యూబ్ చానళ్లను రమ్యనే వెనక ఉండి నడిపిస్తున్నారని, తన పరువుకు భంగం కలిగించేలా ఆమె వ్యవహరిస్తున్నారని పవిత్ర అంటున్నారు. గతంలో కూడా రమ్య రఘుపతి తనపై దాడి చేసేందుకు ప్రయత్నించిందని ఆమె చెప్పారు. ఇక రమ్య రఘుపతి నరేష్‌కి మూడో భార్య అన్న సంగతి తెలిసిందే. 2010లో రమ్యను నరేష్ పెళ్లిచేసుకున్నారు. ఈమె కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె కాగా, నరేష్-రమ్య దంపతులకు ఒక బాబు కూడా ఉన్నాడు. తాను ఎట్టిపరిస్థితుల్లో నరేష్‌కి విడాకులు ఇవ్వబోనని రమ్య స్పష్టం చేసింది. తాను విజయనిర్మలకు మాటిచ్చానని.. విడాకులు ఇవ్వనని తేల్చి చెప్పారు. ప్రస్తుతం రమ్య బెంగళూరులో ఉంటున్నారు.