Patnam Mahender Reddy : ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వేడి మాములుగా లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటున్నారు. మరి కొద్ది రోజులలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీల నుంచి అగ్రనేతలు రంగంలోకి దిగి క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు. కొద్దినెలల వరకు బీఆర్ఎస్‌కు పోటీ ఎవ్వరూ లేరనిపించింది. కానీ వరుసగా రెండు సార్లు అధికారంలో వుండటంతో పాటు ప్రజలు మార్పు కోరుకుంటూ వుండటంతో కాంగ్రెస్‌కు సర్వేలన్నీ అనుకూలంగా వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలంతా కూడా ప్రచారంలో హోరెత్తించడం మొదలు పెట్టారు.
సీఎం కేసీఆర్ మొదలుకొని బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ ప్రచారాలు చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పాలనను రైతుబంధు, ఉచిత విద్యుత్‌పై వారు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి వేళ ఏ బీఆర్ఎస్ నేతయినా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గెలవాలని కోరుకుంటారా. అలాంటిది ఎమ్మెల్సీ, మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి.. రేవంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అసలేం జరిగిందంటే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూర్ బీఆర్ఎస్ అభ్యర్ధి పైలట్ రోహిత్ రెడ్డి, ఇతర నేతలతో కలిసి మహేందర్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు.
ఈ క్రమంలో రోహిత్ రెడ్డిని గెలిపించాలని చెప్పబోయి.. పొరపాటున రేవంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పట్నం మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిని గమనించిన రోహిత్ రెడ్డి ఆయనను వెనుక నుంచి అప్రమత్తం చేశారు. అయితే మహేందర్ రెడ్డి మళ్లీ అప్రమత్తం అయి రోహిత్ రెడ్డి అని అన్నారు. కాని అప్పటికే జరగరాని తప్పు జరిగింది. ఈ బైట్ పట్టుకొని కాంగ్రెస్ నాయకులు తెగ ప్రచారాలు చేసుకుంటున్నారు. ఇక పట్నం మహేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో ఇలాంటి తప్పులు పలు సందర్భాలలో జరగడం మనం చూశాం. తాజాగా బీఆర్ఎస్ నేత నోటి నుండి ఇలాంటి తప్పు దొర్లడంతో ఈ విషయం చర్చనయాంశంగా మారింది.