Pat Cummins : ఆస్ట్రేలియా వన్డే, టెస్టు జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టీమిండియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలో ఆస్ట్రేలియా వేదికగా భారత్, ఆసీస్ మధ్య బార్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ జరగనున్న నేపథ్యంలో అతను ఈ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. ప్యాట్ కమిన్స్ ఈమధ్యే వరుస లీగ్‌లలో పాల్గొన్నాడు. ముందుగా ఐపీఎల్, తరువాత టీ20 ప్రపంచ కప్, అనంతరం యూఎస్ఏ వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలోనూ కమిన్స్ పాల్గొన్నాడు. అయితే ఇండియాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో అతను 8 వారాల సుదీర్ఘ విరామం తీసుకుంటున్నట్లు తెలిపాడు.
త్వరలో ఆసీస్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఆసీస్ టీమ్.. ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడనుంది. అయితే ఈ ఏడాది చివర్లో ఆసీస్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. బార్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ ను నిర్వహించనున్నారు. ఇందుకు గాను ఇప్పటి నుంచే ప్రిపేర్ అయ్యేందుకు కమిన్స్ ఏకంగా 8 వారాల విరామం తీసుకుంటున్నట్లు తెలియజేశాడు. ఇండియాతో సిరీస్ కోసం తాను శారీరకంగానే కాక, మానసికంగా కూడా సిద్ధంగా ఉండాలని అనుకుంటున్నానని, అందుకనే ఈ లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నానని కమిన్స్ తెలిపాడు.
ఇండియాను ఎలాగైనా ఓడిస్తాం..
ఇక గతంలో జరిగిన రెండు బార్డర్ గవాస్కర్ సిరీస్‌లలోనూ ఇండియాదే పైచేయిగా ఉంది. దీంతో భారత్ మరోసారి ఆసీస్‌పై టెస్టు సిరీస్‌లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. అయితే భారత్‌కు ఆ అవకాశం ఇవ్వబోమని, ఈసారి ఇండియాను ఎలాగైనా ఓడించి తీరుతామని కమిన్స్ అన్నాడు. ఇండియన్ ప్లేయర్లు అన్ని ఫార్మాట్ల క్రికెట్ ను బాగా ఆడుతారు, అయితే వారిని మేము పూర్తిగా అర్థం చేసుకున్నాం, కనుక టెస్టు సిరీస్ గెలుస్తామన్న నమ్మకం ఉంది. నా కెరీర్‌లో ఈ ట్రోఫీ ఒక్కటే లోటు. కనుక ఈసారి ఎలాగైనా ట్రోఫీని గెలుస్తాం.. అని కమిన్స్ అన్నాడు.
కాగా కమిన్స్ నాయకత్వంలోని ఆసీస్ జట్టు 2023లో భారత్‌లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్న విషయం విదితమే. ఆ టోర్నీలో మొదట్నుంచి ఫైనల్ వరకు వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఆడిన భారత్, ఫైనల్‌లో మాత్రం ఆసీస్ బౌలింగ్ ముందు చతికిలబడింది. కోట్లాది మంది భారతీయుల ఆశలను ఆసీస్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ భగ్నం చేశాడు. తరువాత కమిన్స్ ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహించి చాలా రోజుల తరువాత జట్టు ఫైనల్‌కు వచ్చేలా చేశాడు. కానీ ఫైనల్‌లో మాత్రం పేలవమైన ప్రదర్శనతో ఎస్ఆర్‌హెచ్‌కు ట్రోఫీ దూరమైంది. అయితే త్వరలో జరగనున్న బార్డర్ గవాస్కర్ సిరీస్‌ను మాత్రం గెలుస్తామని కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు.