Pat Cummins : ప్యాట్ కమిన్స్.. ఈ పేరు చెబితే చాలు, భారతీయ క్రికెట్ అభిమానులకు గతేడాది ఓడిపోయిన క్రికెట్ వన్డే వరల్డ్ కప్ గుర్తుకు వస్తుంది. అయితే అదంతా గతం. ఇక ఇప్పుడు కమిన్స్ మరో అవతారంలో దర్శనమివ్వనున్నాడు. అదే సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా. అవును, జట్టు యాజమాన్యం అతన్ని కెప్టెన్‌గా నియమించింది. దీంతో సన్‌రైజర్స్‌కు ప్యాట్ కమిన్స్ వచ్చే ఐపీఎల్ 2024 సీజన్‌లో నాయకత్వం వహించనున్నాడు. ప్రస్తుత సన్‌రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్‌ను తప్పించి ఆ స్థానంలో కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్‌ను జట్టు యాజమాన్యం నియమించింది.
2023 ఐపీఎల్ సీజన్ సన్‌రైజర్స్ కు పీడకలనే అని చెప్పవచ్చు. మొత్తం 14 గేమ్‌లలో కేవలం 4 మ్యాచ్‌లలోనే గెలిచి పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో నిలిచింది. దీంతో సన్‌రైజర్స్ యాజమాన్యం ఈసారి జట్టులో భారీ మార్పులే చేసింది. గతేడాది భారీ మొత్తం చెల్లించి తెచ్చుకున్న ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో అతన్ని సన్‌రైజర్స్ యాజమాన్యం రిలీజ్ చేసింది. ఇక అతనికి బదులుగా మరికొందరు ఆటగాళ్లను ఈసారి కొనుగోలు చేసింది. వారిలో ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఆ జట్టు బ్యాట్స్‌మన్ ట్రావిస్ హెడ్ ముఖ్యమైన వారు.
డిసెంబర్‌లో జరిగిన వేలంలో ఇతర జట్లతో పోటీ పడిన సన్‌రైజర్స్ ఎట్టకేలకు కమిన్స్‌ను రూ.20.50 కోట్ల భారీ ధర చెల్లించి మరీ కొనుగోలు చేసింది. కమిన్స్‌కు కెప్టెన్‌గా మంచి రికార్డు ఉండడమే అతనికి భారీ ధర పలకడం వెనుక ఉన్న ప్రధాన కారణమని చెప్పవచ్చు. గతేడాది ఐపీఎల్‌లో ఆడని కారణంగా కమిన్స్ వన్డే వరల్డ్ కప్‌పై దృష్టి పెట్టాడు. కప్ సాధించాడు. అలాగే ప్రఖ్యాత్ యాషెస్ సిరీస్‌ను రీటెయిన్ చేయడంతోపాటు వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్‌లోనూ జట్టును గెలిపించాడు. దీంతో అతని ట్రాక్ రికార్డు కారణంగానే సన్‌రైజర్స్ అతన్ని కెప్టెన్‌గా నియమించిందని చెప్పవచ్చు. అసలు కమిన్స్‌ను కొన్నప్పుడే సన్‌రైజర్స్ అతన్ని కెప్టెన్‌గా నియమిస్తుందని భావించారు. అందరూ అనుకున్నట్లుగానే సన్‌రైజర్స్ కమిన్స్‌ను కెప్టెన్‌ను చేసింది. అయితే ఐసీసీ ట్రోఫీలను సాధించినట్లుగానే కమిన్స్ సన్‌రైజర్స్ కు ఐపీఎల్ ట్రోఫీ తెచ్చిపెడతాడని అనుకుంటున్నారు. మరి సన్‌రైజర్స్ ఫ్యాన్స్ కల నిజమవుతుందా.. లేదా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.