Niharika Konidela : మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తాను ప్రేమించిన లావణ్య త్రిపాఠిని నవంబర్1న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నవంబర్ 5న వీరి రిసెప్షన్ జరిగింది. ఇండస్ట్రీకి చెందిన సినీ రాజకీయ ప్రముఖులు వీరి రిసెప్షన్ వేడుకకి హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి తొలిసారి నిహారిక మూవీ ఓపెనింగ్ వేడుకలో కనిపించి సందడి చేశారు. తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఇప్పటి వరకు లఘుచిత్రాలు, వెబ్ సిరీస్‌లు నిర్మించిన నిహారిక.. ఇప్పుడు థియేటర్లలో విడుదల చేసే ఫీచర్ ఫిలింస్ నిర్మాణంలోకి దిగింది. నిర్మాతగా తన తొలి సినిమా ప్రారంభించింది.
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. చిత్రం ముహూర్తపు సన్నివేశానికి హీరో వరుణ్ తేజ్ క్లాప్ కొట్టారు. నాగబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ని నిహారిక కొణిదెల, డైరెక్టర్ యదువంశీ సహా చిత్ర యూనిట్ సభ్యులకు అందించారు. మంచి టీమ్, కాన్సెప్ట్‌తో రాబోతున్న సినిమా ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం. ఇంత మంది కొత్త వాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాం. అయితే మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం అని నిహారిక పేర్కొంది.
ఇక ఈ సినిమా ద్వారా 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ని పరిచయం చేస్తున్నాం అని దర్శకుడు యదువంశీ అన్నారు.. నాకు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటానని నమ్ముతున్నాను. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం’ అని వెల్లడించారు యదువంశీ . ఈ సినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచిరాజు, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేష్, తేజస్వి రావు, విషిక, షణ్ముకి నాగుమంత్రి తదితరులు నటిస్తున్నారు.