ప్రస్తుత తరుణంలో చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో సతమతం అవుతున్నారు. చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు సమస్య చాలా మందిని వేధిస్తోంది. దీంతో నలుగురిలోనూ కలవలేకపోతున్నారు. అయితే తెల్ల జుట్టు సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. కానీ ఏ కారణం ఉన్నా సరే ఇందుకు మార్కెట్‌లో లభించే రసాయనాలు కలిగిన హెయిర్ డై లను వాడాల్సిన పనిలేదు. మనకు అందుబాటులో ఉన్న ప్రకృతి సహజసిద్ధమైన పదార్థాలతోనే తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు ఉసిరికాయ పొడి ఎంతగానో పనిచేస్తుంది. ఇందుకు గాను ఉసిరికాయల పొడిని కాస్త తీసుకుని కొబ్బరినూనెలో వేసి మరిగించాలి. ఈ మిశ్రమాన్ని బాగా మరిగించాక పొడి పూర్తిగా నూనెలో కలుస్తుంది. అప్పుడు నూనెలా మారుతుంది. దాన్ని వడకట్టాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఇలా 45 నిమిషాల పాటు ఉంచాలి. అనంతరం హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారంలో కనీసం 2 సార్లు చేస్తున్నా చాలు.. తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది. జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది. శిరోజాలు కాంతివంతంగా మారుతాయి.
తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు కరివేపాకులు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. కొన్ని కరివేపాకులను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని కొబ్బరినూనెలో వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నూనెను తలకు బాగా మర్దనా చేయాలి. తరువాత 45 నిమిషాల పాటు ఆగి తలస్నానం చేయాలి. ఇలా చేస్తున్నా కూడా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు సమస్యలు తగ్గుతాయి.
ఇక చివరిగా జుట్టును నల్లగా మార్చుకునేందుకు ఉల్లిపాయ రసం కూడా బాగానే పనిచేస్తుంది. ఉల్లిపాయ రసం, ఆలివ్ ఆయిల్‌లను సమపాళ్లలో తీసుకుని బాగా మిశ్రమంగా చేయాలి. దీన్ని జుట్టుకు బాగా పట్టించాలి. 30 నిమిషాలు ఆగి తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే తెల్ల జుట్టు అన్నది ఉండదు. జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు సమస్యలు ఉండవు. ఇలా సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తూ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.