Nara Lokesh : మరికొద్ది రోజులలో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయం మరింత వేడెక్కింది. వైసీపీ కీలక స్థానాలు మారుస్తూ ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే ప్రయత్నం చేస్తుంది. మంగళగిరి నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో మాదిరిగానే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఇక్కడ చిత్తుగా ఓడించాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ క్రమంలోనే అక్కడి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ముందుగా గంజి శ్రీనివాస్‌కు మంగళగిరి టికెట్ కేటాయించింది. కానీ అనూహ్యంగా వైసీపీ విడుదల చేసిన 9వ జాబితాలో మంగళగిరి సీటును గంజి శ్రీనివాస్‌ను తొలగించి.. మురుగుడు లావణ్యకు కేటాయించి షాకిచ్చారు.
ఈ మార్పుపై మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ( ఆర్కే ) స్పందించారు.మంగళగిరిలో మళ్లీ వైసీపీ జెండా ఎగురవేస్తామని ఆర్కే స్పష్టం చేశారు. రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన లావణ్య గెలుపు ఖాయమని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరిలో నాన్ లోకల్, బీసీ అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుందని వ్యాఖ్యానించారు. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న నారా లోకేశ్‌ను ఉద్దేశించి ఆయన నాన్ లోకల్ అని పేర్కొన్నారు. మంగళగిరి సీటు గెలిపించి జగన్‌కు కానుకగా ఇస్తానని అన్నారు. టీడీపీకి మరోసారి భంగపాటు తప్పదని పునరుద్ఘాటించారు.
గత ఎన్నికల్లో మంగళగిరిలో లోకేశ్‌ను ఓడించి వైసీపీ తరఫున ఆర్కే గెలిచారు. కానీ వైసీపీలో పలువురు నేతల తీరుతో విసిగిపోయిన ఆర్కే.. వైఎస్ షర్మిల వెంట కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అక్కడ విధానాలు నచ్చకపోవడంతో తిరిగి వైసీపీ గూటికే చేరారు. లావణ్య తల్లి కాండ్రు కమల 2009 నుంచి 2014 వరకు మంగళగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతకుముందు 2004లో మంగళగిరి మున్సిపల్ చైర్‌పర్సన్‌గానూ ఎన్నికయ్యారు. లావణ్య మామ మురుగుడు హనుమంతరావు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.అయితే ఈ సారి అసెంబ్లీలో లోకేష్‌ని అడుగుపెట్టవద్దనే ఉద్దేశంతోనే వైసీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.కీలక నియోజకవర్గమైన మంగళగిరిలో అభ్యర్ధి మార్పు ఎంత వరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి.