Nara Lokesh : ఏపీలో ఎన్నికలు తరుముకొస్తున్నాయి. వచ్చే నెలలోనే ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో ప్రచారం ఊపందుకుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. టీడీపీ యువనేత నారా లోకేశ్ ను ఉద్దేశించి సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్ ఓటుకు రూ. 6 వేలు పంచుతారని ఆయన అన్నారు. లోకేశ్ డబ్బులు పంచినట్టు మన వైసీపీ అభ్యర్థి లావణ్య పంచలేదని… ఎందుకంటే లోకేశ్ దగ్గర ఉన్నట్టు లావణ్య దగ్గర డబ్బులు లేవని చెప్పారు. లోకేశ్ డబ్బులు ఇస్తే తీసుకోవాలని… అయితే ఓటు వేసే ముందు మాత్రం ఆలోచించాలని అన్నారు.
జూన్, జులై నెలల్లో చేయూత, నేతన్న హస్తం, అమ్మఒడిని ఎవరు ఇస్తున్నారో వారికే ఓటు వేయాలని సూచించారు. ఎవరు అధికారంలో ఉంటే పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందుతుందో ఆలోచించి వారికే ఓటు వేయాలని కోరారు. జగన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక జగన్‌పై నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ బస్సు యాత్ర చేస్తుండగా, మార్గమధ్యంలో రోడ్డు పక్కన ఆయన కోసం ఓ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుడి కుటుంబం ఎదురుచూస్తుండడం, కృత్రిమ శ్వాస తీసుకుంటూ స్ట్రెచర్ పై ఉన్న ఆ రోగిని చూసి సీఎం జగన్ తన కాన్వాయ్ ని ఆపడం, ఆయన ఆ రోగి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితి పట్ల అధికారులకు ఆదేశాలు ఇవ్వడం తాలూకు ఓ వీడియోను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
నీ ప్రచారం పిచ్చి తగలెయ్యా అంటూ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. దిగజారుడు రాజకీయాల్లో నిన్ను కొట్టే వాడు దేశంలోనే లేడని నిరూపించావ్… ఇకనైనా ఈ డ్రామాలు ఆపు జగన్ అంటూ ట్వీట్ చేశారు. మొత్తానికి ఏపీలో ఈ సారి ఎలక్షన్స్ మంచి రసవత్తరంగా అయితే ఉంటాయి. కూటమి విజయం సాధిస్తుందా లేకుంటే జగన్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చి సత్తా చాటుతుందా అని ప్రతి ఒక్కరు ఆలోచనలు చేస్తున్నారు.