Nara Lokesh : ఏపీలో చంద్రబాబు అరెస్టు, రిమాండ్ తర్వాత రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబుకు మద్దతుగా రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ ఇవాళ రాజమండ్రి జైలుకు వెళ్లి ఆయన్ను పరామర్శించిన విషయం తెలిసిందే. అనంతరం మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. ఇరు పార్టీలతో ఓ జాయింట్ కమిటీ ఏర్పాటు చేసి ఉమ్మడిగా పనిచేస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేష్ కూడా స్పందించారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే లక్ష్యంతో త్వరలో టీడీపీ-జనసేన ఉమ్మడి యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు లోకేష్ తెలియజేశారు.
వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా తమను ఎన్నో ఇబ్బందులు పెట్టిందని లోకేష్ తెలిపారు. తన తల్లిని, తండ్రిని అవమానించారని, భార్య బ్రాహ్మణిపైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపించారు. వైసీపీ పాలనతో రాష్ట్రంలో అందరూ విసిగిపోయారన్నారు. తన తండ్రి చంద్రబాబును జైల్లో పెడితే అక్కడి నుంచే వైసీపీ ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్నారని లోకేష్ చెప్పుకొచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై లోకేష్ తీవ్రంగా స్పందించారు. పవన్ ఎక్కడ, ఎప్పుడు ప్యాకేజీ తీసుకున్నారో ఆధారాలు చూపించాలని అన్నారు. మీ చేతిలోనే ఇంటెలిజెన్స్, సీఐడీ ఉన్నాయని, దర్యాప్తు చేసి ఆధారాలు బయటపెట్టాలని లోకేష్ అన్నారు.
వైసీపీ నేతలకు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందంటూ ఆరోపణలు చేశారు లోకేష్. వాళ్లు ఆరోపణలు చేయడం, లేని పోని మాటలు మాట్లాడడం అలవాటుగా మారింది. తమకి అడ్డు వచ్చిన వారిని జైలుకి కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. రేపో మాపో నన్ను కూడా జైలుకి పంపించిన ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు లోకేష్.