Nara Lokesh : ఎవరు ఊహించని విధంగా ఈ సారి కూటమి ఏపీలో విజయకేతనం ఎగరవేసింది. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపు తీరాలకు చేరుకుంది. 39 ఏళ్ల తరువాత మళ్లీ మంగళగిరి నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. మంగళగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ భారీ మెజారిటీతో విజయ ఢంకా మోగించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత 1983, 1985 సంవత్సరాలలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గెలిచారు. అప్పటి నుంచీ మంగళగిరి నియోజకవర్గం అంతు చిక్కకుండా మారింది. అయితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందుగా ప్రకటించినట్టుగానే మంగళగిరి నియోజకవర్గాన్ని కైవసం చేసుకుని మాట నిలబెట్టుకున్నారు.
గుంటూరు జిల్లా మంగగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 91,413 ఓట్ల భారీ మెజారిటీతో తన సమీప వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై గెలుపొందారు. లోకేశ్ కు 1,67,710 ఓట్లు రాగా, లావణ్యకు 76,297 ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన లోకేష్.. జనం ఎగురవేసిన జయకేతనం ఈ అఖండ విజయమని అన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యమన్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి అద్భుత విజయాన్ని అందించిన అశేష ప్రజానీకానికి లోకేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అద్భుత విజయం ప్రజా ఆకాంక్షలకు ప్రతిరూపమని కొనియడారు. సమష్టిగా పని చేస్తూ ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతామని స్పష్టం చేశారు.
ఆదరించిన ప్రజలు, అహర్నిశలు పని చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు, మీడియా మిత్రులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.అయితే పవన్ కళ్యాణ్ తో పాటు టీడీపీ,బీజేపీ మంచి మెజారిటీ సాధించారని కార్యాచరణ గురించి రానున్న రోజులలో చంద్రబాబు, పవన్ ప్రకటిస్తారని నారా లోకేష్ అన్నారు. తాము కక్ష్య సాధింపులకి పోకుంగా కేవల ప్రజా సంక్షేమంపైనే పూర్తి ఫోకస్ పెడతామని కూడా అన్నారు. ఇక పవన్ కళ్యాణ్‌కి ఎలాంటి పదవి ఇస్తారనే దానిపై కూడా నారా లోకేష్‌కి ప్రశ్న ఎదురు కాగా, దానికి ఆయన సున్నితంగా స్పందించారు. ముగ్గురు కలిసి కట్టుగా కూర్చొని పదవుల గురించి నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు.