Nara Lokesh : ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ ఇతర పరిణామాల నేపధ్యంలో అతని తనయుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మూడు నెలల క్రితం అర్ధాంతరంగా నిలిచపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి ప్రారంభం కానుంది. పొదలాడలో 210వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ కావడంతో సెప్టెంబర్ 9వ తేదీన లోకేష్ పాదయాత్ర నిలిచిపోయింది. ఇప్పటి వరకూ 209 రోజుల పాటు 2852.4 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. రెండున్నర నెలల తర్వాత పాదయాత్రను తిరిగి ప్రారంభించారు.
పాదయాత్ర పునఃప్రారంభం సందర్భంగా టిడిపి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పొదలాడ చేరుకున్నారు. పాదయాత్ర మొదలుపెట్టిన మొదటి రోజు నుండే జగన్ అడ్డుకోవడానికి స్కెచ్ లు వేసాడని లోకేష్ ఆరోపించారు. పోలీసుల్ని పంపాడని, పిల్ల సైకోలను పంపినా తగ్గేదే లేదు అన్నామని, మైక్ లాక్కున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఇచ్చిన గొంతు ఆపే మగాడు పుట్టలేదని, సాగనిస్తే పాదయాత్ర… అడ్డుకుంటే దండయాత్ర అవుతుందని చెప్పానన్నారు. యువగళం వాలంటీర్ల మీద కేసులు పెట్టరని, నాయకుల మీద కేసులు పెట్టారని, తన మీద కేసులు పెట్టినా యువగళం ఆగలేదన్నారు.ఆఖరికి మన చంద్రబాబుని అరెస్ట్ చేసి యువగళం పాదయాత్ర ఆపాడని మండిపడ్డారు.
చంద్రబాబు గారిని చూస్తే సైకోకి భయం. అందుకే అక్రమంగా అరెస్ట్ చేసాడని ఆరోపించారు. మరోమూడు నెలల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని, ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని లోకేష్ ప్రకటించారు. రాజారెడ్డి రాజ్యాంగం పనైపోయిందని… అంబేద్కర్ గారి రాజ్యాంగం కాపాడాల్సిన బాధ్యత అందరి పై ఉందన్నారు. 80 ఏళ్ల కార్యకర్త కూడా బెదిరింపులకు భయపడకుండా తొడకొట్టి సవాల్ చేస్తారని, దట్ ఈజ్ టిడిపి పవర్ అన్నారు. వైఎస్సార్‌సీపీ బస్సు యాత్ర కాస్త తుస్సు యాత్రగా మారిందని ఎద్దేవా చేశారు లోకేష్. ఇప్పుడు ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అంటున్నా.. వారిని ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. జగన్ పాలనలో సామాజిక అన్యాయం జరిగిందని.. అనేక మంది దళితులను వేధించి చంపారని ఆరోపించారు.
https://youtube.com/watch?v=lOyzmp2qspU