Nara Lokesh : చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో యువగళానికి కొంత బ్రేక్ ఇచ్చిన నారా లోకేష్ ఇటీవల తిరిగి పాదయాత్ర మొదలు పెట్టారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చారిత్రాత్మక మైలు రాయిని చేరుకుంది. తుని యోజకవర్గం తేటగుంట పంచాయతీలో సోమవారం యువగళం పాదయాత్ర 3 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా పేదల ఆకలి తీర్చే అన్నాక్యాంటీన్ల ను కొనసాగిస్తామని హామీ ఇస్తూ తేటగుంట యనమల అతిధిగృహం వద్ద శిలాఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి, కొడుకు దేవాన్ష్, నందమూరి మోక్షజ్ఞ, బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ పాల్గొని లోకేష్‌తో కలిసి పాదయాత్రలో చేశారు.
శిలాఫలకం ఆవిష్కరణ అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘వైసీపీ ప్రభుత్వం కల్పించిన అన్ని అడ్డంకులను అధిగమిస్తూ పాదయాత్ర సాగుతోంది. ప్రజలే సైన్యంగా యువగళం పాదయాత్ర 3000 కి.మీ. మైలురాయికి చేరింది. తుని నియోజకవర్గం తేటగుంట పంచాయతీలో ఈ మజిలీకి గుర్తుగా వైసీపీ సర్కారు మూసేసిన పేదల ఆకలి తీర్చే అన్నాక్యాంటీన్లు మళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరించాను’ అని అన్నారు.
అయితే పాదయాత్ర మూడు వేల కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా తేటగుంట జాతీయ రహదారి జనసంద్రంగా మారింది. ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో తేటగుంట వద్ద పండుగ వాతావరణం నెలకొంది. లోకేష్‌కు సంఘీభావం తెలుపుతూ టీడీపీ ముఖ్య నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్ర చారిత్రాత్మక మైలురాయి చేరుకున్న సందర్భంగా టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.చిత్తూరు జిల్లా కుప్పం నుంచి జనవరి 27న లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర తొలి అడుగు పడింది. ఫిబ్రవరి 6 తేదీ 100 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి రూరల్ చిన తిమ్మసముద్రం-2 వద్ద మార్చి 9న 500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. ఏప్రిల్ 21న కర్నూలు జిల్లాలోని ఆదోని టౌన్ సిరిగుప్ప క్రాస్ వద్ద వెయ్యి కిలో మీటర్ల మైలు రాయిని లోకేష్ దాటారు. కేవలం 77వ రోజుల్లో లోకేష్ వెయ్యి కిలోమీటర్లు నడిచారు.