Nara Lokesh : ఏపీ రాష్ట్రానికి సంబంధించిన అంశంపై తెలుగోళ్లు హైదరాబాద్‌లో నిరసన తెలపడం శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకి గాను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగోళ్లు ప్రపంచ వ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు తెలిపారని.. హైదరాబాద్‌లో కూడా తెలుగువాళ్లు ఉండటంతో శాంతియుతంగానే నిరసన తెలిపారని లోకేష్ వ్యాఖ్యానించారు. ఎక్కడా కూడా శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా టీడీపీ అభిమానులు ప్రవర్తించలేదని.. అయినా వాళ్లు ఎందుకు భయపడుతున్నారో తనకు అర్ధం కావడం లేదని కేటీఆర్‌ను ఉద్దేశించి లోకేష్ మాట్లాడారు. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఏపీలో టీడీపీ నేతల అరెస్టుపై ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
జగన్ పాలన, ప్రతిపక్షాల అణిచివేతపై రాష్ట్రపతికి తాము వివరించినట్లు లోకేష్ తెలిపారు. భవిష్యత్‌కు గ్యారంటీ అని తమ నాయకుడు చంద్రబాబు, యువగళంతో తాను, వారాహి యాత్రతో పవన్ కళ్యాణ్.. ఇలా ముగ్గురుం ప్రజల్లో చైతన్యం తీసుకువస్తుంటే భయపడిపోయిన జగన్ అక్రమ అరెస్టులు చేసి తమను నిర్బంధిస్తున్నారని లోకేష్ స్పష్టం చేశారు. చంద్రబాబును రెండు రోజులు కస్టడీలోకి తీసుకుని ఆధారాలు ఇవ్వాలని సీఐడీ అధికారులు వేడుకున్నారని.. ఒకవేళ ఆధారాలు ఉంటే మీడియా ముఖంగా ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అంశంపై తాము ఓ వెబ్‌సైట్ అందుబాటులోకి తీసుకువచ్చి వివరిస్తున్నామని.. తాము ఏ కంపెనీ దగ్గర కనీసం కప్పు కాఫీ కూడా తాగలేదని.. అలాంటిది అవినీతి ఎలా చేస్తామని లోకేష్ నిలదీశారు.
అయితే అంతకముందు కేటీఆర్ మాట్లాడుతూ..నాకు నారా లోకేష్ ఫోన్ చేసి ర్యాలీలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు..? అని అడిగారు. శాంతి భద్రతలు ఏం కావాలని నేను అడిగాను. తెలంగాణ ఉద్యమ టైమ్‌లో కూడా ఐటీ కారిడార్‌లో ఆందోళనలు జరగలేదు. అప్పటి ప్రభుత్వాలు ఎలాంటి ర్యాలీలను అనుమతించలేదు. నాకు నారా లోకేష్, వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ అందరూ దొస్తులే. నాకు ఆంధ్రలో ఎలాంటి తగాదాలు లేవు. ఇక్కడ లేని పంచాయితీ ఎందుకు పెడుతున్నారు..?. ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు..?. అసలు ఏపీతో మాకేంటి సంబంధం.. దాన్ని మాకు ఎందుకు చుడుతున్నారు. మాకు ఒక పార్టీగా ఆ అంశంపై ఎలాంటి అసక్తి లేదు. మా పార్టీ వాళ్లు ఏదైనా మాట్లాడితే అది వారి వ్యక్తిగతం. దానికి మా పార్టీకి సంబంధం లేదు..అది పార్టీ స్టాండ్ కాదు’ అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.