Nara Brahmani : చంద్రబాబు అరెస్ట్ తర్వాత నారా బ్రాహ్మణి, భువనేశ్వరి ప్రజలలో తెగ తిరుగుతూ జగన్ పై విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. స్కిల్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును కుటుంబ సభ్యులు సోమవారం కలిసిన విషయం తెలిసిందే. నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి ఆయనతో ములాఖత్ అయ్యారు. వారితో పాటు పార్టీ నేత మంతెన సత్యనారాయణరాజు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. మంచి సాధించబోయే విజయానికి సంకేతం విజయదశమి సంబరమంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. చెడుకి పోయేకాలం దగ్గర పడటం దసరా సందేశమన్న ఆయన, ప్రజల్ని అష్టకష్టాలు పెడుతోన్న జగనాసురుడి పాలన అంతమే పంతంగా అంతా కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు.
మరోవైపు రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరగాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు నారా భువనేశ్వరి తెలిపారు. నేటి ఈ చీకట్లు తొలగిపోయి మంచి జరగాలని, అందరి ఇళ్లల్లో సంతోషం వెల్లి విరియాలని ఆకాంక్షించారు. ‘మనం చేద్దాం జగనాసుర దహనం’ పేరుతో కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. సోమవారం రాత్రి 7గంటల నుంచి 5 నిమిషాల పాటు ‘మనం చేద్దాం జగనాసుర దహనం’ పేరుతో నిరసన తెలపాలని పార్టీ శ్రేణులను, ప్రజలను కోరింది.
చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం మనం చూస్తున్నాం.. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఇప్పటికే ‘ మోత మోగిద్దాం’, ‘కాంతితో క్రాంతి’, ‘న్యాయానికి సంకెళ్లు’ వంటి కార్యక్రమాలను టీడీపీ శ్రేణులు నిర్వహించారు. తాజాగా ‘మనం చేద్దాం జగనాసుర దహనం’ పేరుతో సోమవారం రాత్రి ఐదు నిమిషాలు తమ నిరసన తెలపనున్నారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఒక్కటిగా వైకాపా ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తూ ‘సైకో పోవాలి’ అని రాసిన పత్రాలను దహనం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పార్టీ శ్రేణులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాజాగా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మిణి ఆసక్తికర ట్వీట్ చేశారు. . దుర్గాదేవి మహిషాసురుడిని అంతం చేయడానికి తొమ్మిది రాత్రులు యుద్ధం చేసింది. విజయం సాధించే వరకు పోరాడటమే దసరా స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో కలియుగ అసురులను అంతమొందించే వరకు పోరాడుదాం! అంటూ పేర్కొంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను షేర్ చేసింది. ‘దేశం చేస్తోంది రావణ దహనం.. మనం చేద్దాం జగనాసుర దహనం’ అంటూ రాసిఉంది.