Nara Bhuvaneshwari : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. నంద్యాలలో అరెస్ట్ అయిన చంద్రబాబును విజయవాడ తీసుకొస్తున్నారు. ఈ సమయంలో చంద్రబాబుకు జనసేనాని, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి మద్దతు ప్రకటించారు. చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. సీబీఐ నేతలు అరెస్ట్ ను తప్పు బట్టారు. వైసీపీ నేతలు స్కిల్ స్కాంలో చంద్రబాబు పాత్ర పైన ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ సమయంలోనే భువనేశ్వరి స్పందించారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం తన సోదరుడు రామకృష్ణతో కలిసి మీడియాతో ఆమె మాట్లాడుతూ… తన భర్తను అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా నమస్కారాలు. ఒక బిడ్డకు మనసు బాగో లేనప్పుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్తాడు. అందుకే విజయవాడ కనకదుర్గమ్మకు నా బాధను చెప్పుకోవడానికి, ఆమె ఆశీర్వచనం కోసం ఇక్కడకు వచ్చాను. అమ్మవారిని నేను కోరింది ఒకటే. మా ఆయన చంద్రబాబును రక్షించమని, ఆయనకు మనోధైర్యం ఇవ్వాలని కోరుకున్నా. ఆయన పోరాటం ఆయన ఒక్కరి కోసమో, ఆయన కుటుంబం కోసమో కాదు. ఆయన పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం. నేను ఒక్కటే కోరుతున్నా… మీ అందరి కోసం చంద్రబాబు చేస్తున్న పోరాటం దిగ్విజయం కావడానికి అందరూ చేయిచేయి కలపాలి. జై దుర్గాదేవి, జైహింద్, జై అమరావతి’ అని భువనేశ్వరి అన్నారు.
ఏపీ ప్రజల కోసం చంద్రబాబు పోరాటం చేస్తున్నారని వివరించారు. ప్రజల కోసం చంద్రబాబు సాగిస్తున్న ప్రయాణం దిగ్విజయం కావాలని ఆకాంక్షించారు. ప్రతీ ఒక్కరు చేయి చయి కలిపి మద్దతుగా నిలవాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు. ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్నది ఏంటో గుర్తించాలని సూచించారు. ఇక చంద్రబాబు అరెస్ట్ పైన నందమూరి రామకృష్ణ ఎమోషనల్ అయ్యారు. చంద్రబాబును పాత కేసులో అరెస్ట్ చేసారని చెప్పుకొచ్చారు. ఇదంతా ప్రభుత్వం కుట్రగా ఆరోపించారు. ఆయన ఏపీ ప్రజలకు సేవ చేసారని .. ప్రతీ సందర్భంలోనూ రాష్ట్రం కోసమే పని చేసారని వివరించారు. రాష్ట్రం కోసం చంద్రబాబు కష్టపడ్డారని చెప్పుకొచ్చారు.