Nara Bhuvaneshwari : చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయన ఫ్యామిలీ అంతా రాజమండ్రిలోనే ఉంటున్నారు. ఆయన త్వరగా బయటకు రావాలని ప్రార్ధనలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవిదేశాల్లోని ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు సర్వమత ప్రార్థనలు చేస్తున్నారు. ఆలయాలు, చర్చిలు, మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు జరిపిస్తున్నారు. చంద్రబాబును జైలుకు తరలించినప్పటి నుంచి ఆయన కుటుంబ సభ్యులు కూడా రాజమండ్రిలోనే ఉంటూ ప్రార్ధనలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబు అర్ధాంగి బుధవారం చర్చికి వెళ్లారు. రాజమండ్రి జాంపేటలోని సెయింట్ పాల్స్ లూథరన్ చర్చిలో నారా భువనేశ్వరి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్యాండిల్స్ వెలిగించి చంద్రబాబు త్వరగా బయటకు రావాలని కోరుకున్నారు. నారా భువనేశ్వరి రాక నేపథ్యంలో లూథరన్ చర్చిలో ఫాస్టర్లు ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో భువనేశ్వరితో పాటు ఆమె సన్నిహితులు, పలువురు నేతలు పాల్గొన్నారు.
చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న శాంతియుత నిరసనలను కూడా అనుమతించకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న అణచివేత ధోరణిని భువనేశ్వరి తీవ్రంగా తప్పుబట్టారు. కార్యకర్తలు తమ బిడ్డలతో సమానం.. ఆ బిడ్డలు తల్లిదండ్రుల కోసం నేడు హింసకు గురవుతున్నారని.. జైలుకు వెళ్తున్నారని బాధ వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నేటి లీడర్ షిప్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ ఘటనలే నిదర్శనమన్నారు. టీడీపీ కుటుంబానికి పెద్ద అయిన చంద్రబాబు కోసం బిడ్డల్లాంటి కార్యకర్తలు నిరాహార దీక్ష చేస్తుంటే లాఠీలతో కొట్టడం బాధాకరమన్నారు. వేటికీ బెదరకుండా పోరాటం చేస్తున్నా.. అండగా నిలుస్తున్న కార్యకర్తలందరికీ భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు.
తప్పుడు కేసులతో చంద్రబాబును జైల్లో పెట్టిన ప్రభుత్వం.. ఆయన భోజనం చేసేందుకు కనీసం టేబుల్ కూడా సమకూర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు భువనేశ్వరి. అడ్వకేట్ లెటర్ పెట్టిన తర్వాత మాత్రమే ఆయనకు టేబుల్ ఏర్పాటు చేశారని తెలిపారు. చంద్రబాబును మానసిక క్షోభకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇలాంటి చిల్లర ఆలోచనలతో చంద్రబాబును ఎవరూ మానసిక క్షోభకు గురిచేయలేరని భువనేశ్వరి అభిప్రాయపడ్డారు.45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు చిన్న తప్పు కూడా చేయలేదన్నారు. తానే సొంతంగా ఒక సంస్థను నడుపుతున్నానని, ఆ సంస్థలో 2 శాతం వాటా అమ్మినా రూ. 400 కోట్లు వస్తాయని చెప్పారు. ఇక ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. ఏం తప్పు చేశారని ఆయనను జైల్లో పెట్టారని ప్రశ్నించారు ఆమె. ఇక హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఐటీ ఉద్యోగులు వస్తుంటే ఎందుకు అడ్డుకున్నారని మండిపడ్డారు. ఏపీకి రావాలంటే పాస్ పోర్ట్, వీసా కావాలా? అని నారా భువనేశ్వరి ధ్వజమెత్తారు.