Nara Bhuvaneshwari : చంద్రబాబు అరెస్ట్ తర్వాత నారా వారి మహిళలు రాజకీయాలలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. మొన్నటివరకు ఇంటికే పరిమితమైన వారు ఇప్పుడు పలు సభలు నిర్వహిస్తూ వైసీపీకి గట్టిగా ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని భువనేశ్వరి సందర్శించారు. 19 రోజులుగా టీడీపీ కుటుంబ పెద్ద అయిన చంద్రబాబును నిర్బంధించారని.. ఏం తప్పు చేశారని ఆయన్ను నిర్బంధిచారని ప్రశ్నించార. 45 ఏళ్ల నుంచి చంద్రబాబు రాజకీయ జీవితంలో ఉన్నారని.. రాష్ట్ర ప్రజల కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డారన్నారు.
చంద్రబాబు అరెస్టుపై శాంతియుత నిరసనలు తెలుపుతున్న వారిని పోలీసులు ఇబ్బందిపెట్టడం సరికాదన్నారు. మహిళల విషయంలోనూ దురుసుగా వ్యవహరించడం సరికాదన్నారు. తన విషయంలోనే చాలా దుష్ప్రచారం చేశారని.. వాటిని తాను మరిచిపోనన్నారు. తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. తానేంటే తన ఆత్మసాక్షికి తెలుసని.. ఈ విషయంలో తన భర్త నమ్మకం ఉంటేచాలని వ్యాఖ్యానించారు. మహిళల అభివృద్ధి కోసం ఆయన కృషి చేస్తారని.. మహిళలంటే చంద్రబాబుకు నమ్మకమని చెప్పుకొచ్చారు. ఎప్పుడు బయటకు రాని మహిళలు చంద్రబాబు కోసం ఇప్పుడు రోడ్డుపైకి వస్తున్నారని భువనేశ్వరి అన్నారు.
చేయి చేయి కలిపి చంద్రబాబుకు అండగా నిలుద్దామన్నారు. చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని నమ్మి అంతా నిరసన తెలుపుతున్నారన్నారు. చంద్రబాబు కోసం శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తున్న మహిళలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో సెప్టెంబర్ 9న అరెస్టైన చంద్రబాబు నాయుడు.. నాటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయనకు మద్ధతుగా టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అక్రమ కేసులతో చంద్రబాబును జైల్లో పెట్టారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.