Nara Bhuvaneshwari : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత కొద్ది రోజులుగా చాలా బాధపడుతున్నారు. ఆయనకు బెయిల్ కోసం లోకేష్ ఎంతగానో ట్రై చేశారు. అయితే ఇన్ని రోజులకి కాస్త ఊరట లభించింది. ఆయనకు నాలుగు వారాల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఈరోజు సాయంత్రం జైలు నుంచి బయటకు రానున్నారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరుపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు.
చంద్రబాబుకి బెయిల్ మంజూరు అవడంపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి స్పందిస్తూ… మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు బెయిల్ రావడంపై తానే కాదు ప్రజలందరూ సంతోషిస్తున్నారన్నారు. నేడు జనం గెలిచారని.. ఈ సంతోషం అందరిది అని అన్నారు. చంద్రబాబు క్షేమంగా జైలు నుంచి రావాలని ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే రైలు దుర్ఘటన బాధితులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు భువనేశ్వరి తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజమండ్రికి వచ్చిన భువనేశ్వరి గత 53 రోజులుగా అక్కడే ఉన్నారు. చంద్రబాబు విడుదల కోరుతూ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అలాగే చంద్రబాబు పట్ల ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. పలు మార్లు రాజమండ్రి జైలుకు వెళ్లి చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. భువనేశ్వరికి పలువురు నేతలు మద్దతు తెలుపుతూ పరామర్శించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత చంద్రబాబు రాజమండ్రి నుంచి అమరావతిలోని తన నివాసానికి వెళ్తారు. ఆయన వెళ్లే మార్గంలో ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు. చంద్రబాబు ఎన్ఎస్జీ సెక్యూరిటీ, చంద్రబాబు కాన్వాయ్ జైలు వద్దే అందుబాటులో ఉంది. కాన్వాయ్ ద్వారా చంద్రబాబు సెంట్రల్ జైలు నుంచి అమరావతికి బయలుదేరుతారు. బుధవారం తిరుమల శ్రీవారి దర్శనానికి చంద్రబాబు వెళ్లనున్నారు. అనంతరం హైదరాబాద్ వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు.