Naga Babu : దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయోనన్న టెన్షన్ పార్టీల అధినేతలు, అభ్యర్ధులు, కార్యకర్తల్లో ఉండగా, ఎట్టకేలకి ఏపీ ఫలితాలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం మంచి విజయం సాధించింది. ఎవరు ఊహించని విధంగా పార్టీ ఫలితాలు రాబట్టింది. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. తాను పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లోనూ విజయం సాధించింది. జనసేనాని పోటీచేసిన పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై ఏకంగా 70వేలకు పైగా మెజారిటీతో గెలవడం విశేషం. ఇలా పవర్‌స్టార్ ఈసారి ఎన్నికల్లో వన్‌మ్యాన్ షోతో దూసుకెళ్లారు.
ఇక పిఠాపురంలో పవన్ గెలుపుపై ఆ పార్టీ నేత నాగబాబు తాజాగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఈ గెలుపు లక్ కాదు, లాటరీ అంతకంటే కాదు అన్నారు. ఈ విజయం పిఠాపురం ప్రజల అభిమానానికి బహుమానం అని ఆయన పేర్కొన్నారు. దిగ్విజయంతో మా భారం దించింది మీరే, ఓటేసి మాపై బాధ్యత పెంచింది మీరే అని ఓటర్లను ఉద్దేశించి నాగబాబు అన్నారు. భరోసాతో నిలబెట్టారని తెలిపారు. బాధ్యతతో కాదు భయంతో పనిచేస్తాం, పని చేయిస్తామన్నారు. పిఠాపురం పురోగతికి సేనాని సిగ్నేచర్ పెడతామంటూ నాగబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి తమ్ముడి వెంటే నాగబాబు ఉన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు తనవంతుగా కృషి చేశారు. నాగబాబు గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి జనసేన తరఫున ఎంపీగా పోటీ చేశారు. కానీ వైసీపీ ప్రభంజనంలో ఆయన ఓడిపోయారు.
అయినప్పటికీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ.. తమ్ముడికి అండగా నిలబడ్డారు. 2024 ఎన్నికల్లో నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. కానీ పొత్తు ధర్మంతో పవన్ కల్యాణ్ ఆ సీటును బీజేపీకి త్యాగం చేశారు. దీంతో ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ జనసేన విజయం కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ముఖ్యంగా పిఠాపురంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇప్పుడు కూటమి విజయం సాధించి.. అధికారంలోకి వచ్చింది కాబట్టి.. తన సోదరుడికి ఎలాగైనా మంచి పదవి అప్పగించాలని పవన్ కల్యాణ్ చూస్తున్నారని.. అందుకే టీటీడీ చైర్మన్ పదవిని నాగబాబుకు ఇవ్వాలని చంద్రబాబును అడిగారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నాగబాబు స్పందించి అదంతా వట్టి ప్రచారమేనని స్పష్టంచేశారు.