Naga Babu : ఏపీలో ఈ సారి వైసీపిని ఓడించాలని టీడీపీ, జనసేన పట్టుబట్టాయి. ఎన్నికల పొత్తుల్లో జనసేన పరిమితమైన స్థానాల్లో పోటీ చేయాల్సి రావడంతో పవన్ కళ్యాణ్ సోదరుడు నటుడు నాగబాబు కూడా అవకాశం కోల్పోయారు. నాగబాబు లోక్‌సభ అభ్యర్ధిగా పోటీ చేయాలని భావించినా చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నారు. బీజేపీ-టీడీపీ కూటమితో జట్టు కట్టడంతో త్యాగాలు తప్పలేదని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పొత్తుతో అనూహ్యంగా నాగబాబు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. టీడీపీ- జనసేన- బీజేపీ పొత్తుల వల్ల ఈ సీటును కమలం పార్టీకి కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.
పొత్తుల మధ్యవర్తిత్వం వల్ల తనకు త్యాగాలు తప్పలేదని అన్నారు. బీజేపీ సీట్లు కోరుకోవడంతో తాను కొన్ని సీట్లు వదిలేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. తన సొంత అన్న నాగబాబు పార్లమెంట్ సీటు కూడా వదులుకోవాల్సి వచ్చిందని ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. అంటే.. నాగబాబు పోటీ చేయట్లేదని స్వయంగా పవన్ ప్రకటించేశారన్న మాట. అనకాపల్లి నుంచి ఎంపీ టికెట్ ఆశించిన జనసేన నేత నాగబాబు.. సీటు దక్కకపోవడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన కార్యకర్తగా ఉండటం కంటే తనకు ఏ పదవి ముఖ్యం కాదని అన్నారు. పొత్తులో భాగంగా త్యాగాలు చేయాల్సి వచ్చిందని, పవన్ తనకు పదవి ఇచ్చినా ఇవ్వకున్న పార్టీ కోసం పని చేస్తానన్నారు. జనసేన కార్యకర్తగా నాయకుడి ఆశయాల కోసం కృషి చేస్తానన్నారు.

నాగబాబుకు మాటిచ్చి కూడా పొత్తులో బీజేపీ కి సీటు ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. అయినా జనసేన గెలుపు కోసం పని చేస్తానని నాగబాబు చెప్పారని.. తనను అర్ధం చేసుకున్న అన్నకు పవన్ సభావేదికగా కృతజ్ఞతలు తెలిపారు. పొత్తులు అనుకున్నాక చాలా సమస్యలు, త్యాగాలు ఉంటాయని వివరించారు. తాను మధ్యవర్తిత్వం వహించడం వల్ల ఎంతో నష్టపోవాల్సి వస్తోందని చెప్పారు. పెద్ద మనసుతో వెళ్తే.. తానే సీట్లు వదులు కోవాల్సి వచ్చిందని తన మనసులోని మాటను వెలిబుచ్చారు. పొత్తులో భాగంగా సీట్లు రాని వారు తనను తిట్టినా భరించక తప్పదని అన్నారు. కానీ స్థాయిని మరిచినా, పొత్తు ధర్మాన్ని నాశనం చేసినా.. ఊరుకునేది లేదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.