Muralimohan : చంద్రబాబు అరెస్ట్ తర్వాత చాలా మంది ప్రముఖులు మీడియా ముందుకు వచ్చి జగన్‌పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా మురళీ మోహన్ కూడా చంద్రబాబు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.74 సంవత్సరాలు ఉన్న ఒక మంచి ముఖ్య మంత్రిని జైల్లో పెట్టడం అన్యాయమని మాజీ ఎంపీ మురళీ మోహన్ అన్నారు. వెంటనే ఆయన విడుదల కావాలన్నారు. రెట్టించిన ఉత్సాహంతో ఆయన ఇంకా ఇంకా మంచి పనులు చేయాని ఆకాంక్ష వ్యక్తం చేశారు. అరచేయితో సూర్యుని ఆపలేము గ్రహణం విడిచిన వెంటనే వచ్చే కాంతి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసన్నారు. చంద్రబాబు కూడా గ్రహణం విడిచి అలా బయటికి వచ్చి అద్భుతంగా పనిచేయాలని నేను కోరుకుంటున్నానని తెలిపారు.
ఏపీకి పోలవరం ప్రాజెక్టు జీవనాడి కాగా, పోలవరం ప్రాజెక్టు అమరావతి నగరం ఇవన్నీ కూడా అద్భుతంగా ఆయన గ్రహణం విడిచి బయటికి వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తారని తాను నమ్ముతున్నానని మురళీ మోహన్ స్పష్టం చేశారు. సైబరాబాద్ పేరుతో హైదరాబాద్‌లో హైటెక్ సిటీ కడుతున్నాం.. మీరు రావాలి అని ఆరోజున బిల్ గేట్స్‌ను చంద్రబాబు అడగడంతో అమెరికా దాటి ఆఫీసులు పెట్టలేదు. ఇండియాలో పెట్టాలనుకుంటే తప్పకుండా హైదరాబాద్‌లో పెడతా అని మాటిచ్చారట. అన్నట్టుగానే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పెట్టారు. మైక్రోసాఫ్ట్ వచ్చేసరికి మిగిలినవాళ్లంతా ఒకరి తర్వాత ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చేశారు. హైటెక్ సిటీ ఓపెనింగ్‌కి అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్‌ను తీసుకొచ్చారు.
ఎలా మ్యానేజ్ చేశారో.. ఏం చేశారో తెలీదు కానీ.. తీసుకొచ్చారు. ఆరోజున బిల్ క్లింటన్‌కు షేక్ హ్యాండ్‌లు ఇచ్చినవారంతా నాలుగు రోజులు ఈ చేయిని కడుక్కోను అన్నంతగా అనుభూతి చెందారు. అలాంటి గొప్ప వ్యక్తిని హైటెక్ సిటీ ఓపెనింగ్‌కు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుది’ అని మురళీమోహన్ వ్యాఖ్యానించారు. ఒక మంచి ముఖ్యమంత్రిని, ఎంతో ఆదర్శంగా హైదరాబాద్‌ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి.. అమరావతిని బ్రహ్మాండంగా డెవలప్ చేయడానికి అనేక ప్లాన్స్ వేసిన వ్యక్తిని ఈరోజు తీసుకెళ్లి జైల్లో పెట్టారు. నీతిగా, నిజాతీయగా పనిచేసే అలాంటి వ్యక్తులను జైల్లో పెట్టడం చాలా అన్యాయం. వెంటనే ఆయన విడుదల కావాలి.. రెట్టించిన ఉత్సాహంతో ఆయన ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని అనుకుంటున్నాను అని మురళీ మోహన్ స్పష్టం చేశారు.