MP Gorantla Madhav : అధికార వైసీపీలో ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. అభ్యర్థుల విషయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ నేతలకు గుబులు పుట్టిస్తుండడం సంచలనంగా మారింది. ఐ ప్యాక్‌తో పాటు, సొంత సర్వేల్లో వెనుకపడిన ఎమ్మెల్యేలకు జగన్ టికెట్ నిరాకరిస్తున్నారు. పైగా తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తరువాత అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్ జాగ్రత్త వహిస్తున్నారు. ఇటీవల పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై ఎంపీ గోరుంట్ల మాధవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకొనొక సమయంలో ఆయన ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణరెడ్డితో గొడవకు కూడా దిగినట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. గోరుంట్ల మాధవ్ వైసీపీకి గుడ్ బై చెబుతున్నారనే ప్రచారం కూడా జరిగింది.
తాజాగా దీనిపై గోరుంట్ల మాధవ్ తనదైనశైలిలో స్పందించారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని.. పార్టీ నాకు తల్లి లాంటిదని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీకి వ్యతిరేకంగా తాను ఎక్కడ మాట్లాడలేదని.. సోషల్ మీడియాలో నాపై వస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవమని గోరుంట్ల మాధవ్ తెలిపారు. టికెట్ విషయంలో తాను పార్టీ పెద్దలపై ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదని ఆయన స్పష్టం చేశారు. వైసీపీని వీడే ప్రసక్తే లేదని.. టికెట్ వచ్చిన రాకపోయిన పార్టీలోనే కార్యకర్తగా కొనసాగుతానని గోరుంట్ల మాధవ్ పేర్కొన్నారు. వైసీపీలోనే ఉండి చావో రేవో తేల్చుకుంటానని చెప్పి సంచలన కామెంట్స్ చేశారు.
సజ్జల పార్టీలో అందరితో ఓర్పుతో మాట్లాడతారని ఎంపీ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు.సజ్జలతో గొడవ పడినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.వైసీపీలో కలహాలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.సీఎం జగన్ ఆదేశాలు తమకు శిరోధార్యమని స్పష్టం చేశారు. అందరిని ప్రేమగా చూసుకునే ఆయనతో తాను గొడవ పడినట్లు, జగన్ తో పెద్దిరెడ్డి వాగ్వాదం చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయని మండిపడ్డారు. ఆయా సంస్థలు కడుపుకి అన్నం తిని విషం కక్కుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక సమీకరణలను అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందని, కులాలకు అన్ని ప్రాంతాలకు అన్ని మతాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలని భావిస్తోందని చెప్పారు.