MLC Kavitha : ప్రస్తుతం ఎన్నికల హడావిడి నడుస్తుంది. ఎక్కడ చూసిన ఆయా పార్టీలు ప్రచారాలలో బిజీగా ఉన్నారు. పలువురు నామినేషన్ వేస్తున్నారు. అయితే తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్కూటీపై ప్రయాణించారు. సామాన్యురాలిగా ఆమె స్కూటీపై వెళ్తుండటం చూసిన స్థానికులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఆమెకు అభివాదం చేసేందుకు పోటీపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్ బోధన్ ఆర్‌వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. బోధన్ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ నామినేషన్ ప్రక్రియకు ఆ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బైక్ పైన వెళ్లారు.
ట్రాఫిక్ జామ్ కావడంతో ఆమె ద్విచక్రవాహనంపై నామినేషన్ ప్రక్రియ కోసం వెళ్లవలసి వచ్చింది. కవిత బైక్‌పై వెళ్తుండగా సెక్యూరిటీ సిబ్బంది, కార్యకర్తలు వెంట పరుగు పెట్టారు. షకీల్ నామినేషన్ ప్రక్రియలో కవిత వెంట ఉన్నారు. కాగా, షకీల్ నామినేషన్ సందర్భంగా బోధన్ పట్టణంలో బీఆర్ఎస్ ప్రచార వాహనంలో ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో కవిత పాల్గొన్నారు. షకీల్ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కవిత మాట్లాడుతూ… దేశమంతా గులాబీ హవా నడుస్తోందన్నారు. షకీల్‌ను ఇక్కడి నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. షకీల్ నామినేషన్ ర్యాలీని చూస్తుంటే విజయోత్సవ ర్యాలీలా కనిపిస్తోందన్నారు. ఈ జోష్ షకీల్ విజయం ఖాయమని చెబుతోందన్నారు.
అయితే నామినేషన్ దాఖలుకు ముందు ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు కవిత. ఈ ర్యాలీకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరు కావాల్సి ఉంది. ఆమె వెళ్తున్న దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ఆమె వాహనం ట్రాఫిక్ లో చిక్కుకుంది. దీంతో ఎమ్మెల్సీ కవిత ర్యాలీ ప్రారంభ స్థలికి చేరుకొనేందుకు స్కూటీపై ప్రయాణించారు. ఓ వ్యక్తి స్కూటీని నడుపుతుండగా కవిత వెనుకాల కూర్చొని ప్రయాణించారు.ఈ సన్నివేశాలని ప్రతి ఒక్కరు తమ కెమెరాలలో బంధించారు.