MLA Pardhasaradhi : పెనమలూరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జీగా జోగి రమేష్ ను పార్టీ అధిష్టానం నియమించడంపై వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తన అసంతృప్తి వ్యక్తం చేశారు. . ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు చేయకపోవడం, వారిపై అసభ్య పదజాలం వాడకపోవడమే నా అసమర్థతా.? అంటూ ప్రశ్నించారు. వైసీపీలో బీసీలకు అగ్ర తాంబూలం అనేది నేతి బీరకాయలో నెయ్యి చందమే అని మండిపడ్డారు. ‘గన్నవరంలో పార్టీ గెలిచే పరిస్థితి లేదు. అందుకే నన్ను అక్కడికి వెళ్లమన్నారు. బీసీ నేతను కాబట్టి అక్కడ ఓడినా పర్వాలేదని భావించారు. నేను అక్కడికి వెళ్లేందుకు విభేదించడం పార్టీ అధిష్టానానికి నచ్చలేదు. బలహీన వర్గాలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని గతంలో చెప్పాను.
అది తప్పని తెలుసుకోవడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. బీసీ, ఎస్సీలు, ఎవరి కాళ్లపై వారు నిలబడాలనుకుంటారు. మరొకరి పెత్తనంపై ఆధారపడాల్సి వస్తే మాత్రం అభిమానం చంపుకోరు.’ అని వ్యాఖ్యానించారు. తనకు అర్హత ఉన్నా.. మంత్రి పదవి దక్కలేదని, ఇప్పుడు టికెట్ విషయంలోనూ పక్కన పెట్టారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ కష్టపడ్డానని.. అయినా తగిన గుర్తింపు లేదని వాపోయారు. పెనమలూరు నియోజకవర్గంతో 30 ఏళ్ల అనుబంధం ఉంది. తనతో ఉన్న వారందరితో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.
బలహీనవర్గాలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని గతంలో చెప్పానని.. కానీ, అది తప్పని తెలుసుకోవడానికి తనకు ఎంతో సమయం పట్టలేదని పార్థసారథి అన్నారు. ‘బీసీ, ఎస్సీలు ఎవరి కాళ్లపై వారు నిలబడాలని అనుకుంటారు. మరొకరి పెత్తనంపై ఆధారపడాల్సి వస్తే ఆత్మాభిమానం చంపుకోరు’ అంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. పార్థసారథి టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపారు. జనవరి 18న కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహిస్తున్న ‘రా.. కదలి రా’ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. అయితే, పెడమలూరులో టీడీపీ ఇంఛార్జిగా ఉన్న బోడే ప్రసాద్.. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఆ స్థానాన్ని పార్థసారథికి కేటాయిస్తుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.