MLA Kotamreddy Sridhar Reddy : చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ నాయకులు దారుణమైన విమర్శలకు దిగుతున్నారు. వైసీపీ ప్రభుత్వంతో పాటు పలువురు మంత్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కింద ఏర్పాటు చేసిన సెంటర్ల సందర్శనకు, బహిరంగ చర్చకు వైసీపీ సిద్ధమా? అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సవాల్ చేశారు. మధ్యవర్తులుగా మేధావులను (జయప్రకాష్ నారాయణ, జేడీ లక్ష్మినారాయణ) తీసుకురావచ్చునని, లేదా వైసీపీకి నచ్చిన వారిని తేవచ్చునని చెప్పుకొచ్చారు . అన్ని స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సెంటర్లకు మీడియాతో సహా వస్తే అక్కడే లెక్కలు తెలుస్తామన్నారు. ఈ బహిరంగ చర్చకు సాక్షి పేపరు, టీవీ వచ్చినా పర్వాలేదని తమకు అభ్యంతరం లేదని కోటంరెడ్డి స్పష్టం చేశారు.
ఇక టీవీ డిబేట్‌లో కోటం రెడ్డి జగన్‌పై నిప్పులు చెరిగారు. అప్పట్లో ఏపీ రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేస్తానని చెప్పిన ఆయన ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేశారని అన్నారు. జగన్‌తో పాటు మేమందరం కూడా అభివృద్ధి చేస్తామని చెప్పాం. కాని ఆయన చెప్పిన మాటలు ఒక్కటి జరగలేదు. వచ్చే ఎన్నికలలో జగన్ దారుణమైన పరాజయం చవిచూస్తాడు. పవన్ కళ్యాణ్,చంద్రబాబు, లోకేష్ కాంబినేషన్‌లో 160 సీట్లు.. 57 శాతం ఓట్లు తప్పక వస్తాయని కోటం రెడ్డి జోస్యం చెప్పారు. ఆయన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను వైసీపీలో మెజార్టీ వర్గం వ్యతిరేకిస్తోందని ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రాజకీయంగా నష్టపోతామని వైసీపీ నేతలే అంటున్నారని… వైసీపీ సానుభూతిపరుడైన ఓ పారిశ్రామికవేత్త ప్రశాంత్ కిషోర్ కు ఫోన్ చేసి చంద్రబాబు అరెస్ట్ పై ఆరా తీశారన్నారు. వైసీపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ప్రశాంత్ కిషోర్ చెప్పారని.. లోకేష్‍ని అరెస్ట్ చేస్తే వైసీపీకి మరింత నష్టమని ప్రశాంత్ కిషోర్ అన్నారని కోటంరెడ్డి తెలిపారు. పవన్ కళ్యాణ్‍పై కేసులు పెట్టవద్దని ప్రశాంత్ కిషోర్ చెప్పారని కోటంరెడ్డి ప్రకటించారు.