MLA Alla Ramakrishna Reddy : జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాడు. ఆయన వేసే స్టెప్పులు హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల చంద్రబాబుతో ములాఖత్ అయిన పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత తాను టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్టు తెలియజేశాడు. దీంతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు వైసీపీ నాయకులతో విమర్శల బారిన పడుతున్నాడు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఎందుకు పెట్టారన్నారు. ఏ రాజకీయ నాయకుడైనా పార్టీ పెట్టి అధికారంలోకి రావాలని చూస్తారన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తను పార్టీ పెట్టింది అధికారంలోకి రావడానికి కాదన్న ఆయన.. టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని విమర్శించారు.
ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే పొత్తులు పెట్టుకుంటారన్న ఆయన.. వపన్ మాత్రం పార్టీ పెట్టిన సమయంలోనే టీడీపీతో పొత్తు పెట్టుకొని, చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడానికి ప్యాకేజీ తీసుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీని ఏర్పాటు చేయడం ఏందుకని విమర్శించారు. పార్టీ స్థాపించిన పవన్ పొత్తులు పెట్టుకునే బదులు ఆ పార్టీని టీడీపీలో విలీనం చేస్తే మంచిదని హితువు పలికారు. మరోవైపు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రామకృష్ణారెడ్డి.. చంద్రబాబు చరిత్ర మొత్తం వెన్నుపోటు చరిత్రే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అధికారం కోసం సొంత మామను మోసం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నందమూరి కుటుంబ సభ్యులను సైతం మోసం చేస్తున్నారని విమర్శించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక పవన్‌కు ఇస్తానన్న ప్యాకేజీ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్‌ను సైతం మోసం చేస్తారన్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీచేయదలుచుకుంటే ఏ పార్టీతో పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆయన.. చంద్రబాబు లాంటి మోసపూరిత వ్యక్తితో పొత్తులు పెట్టుకొని పార్టీని దివాలా తీసే పరిస్ధితి తెచ్చుకోవద్దని సూచించారు. చంద్రబాబు, పవన్‌తో పాటు ఇతర పార్టీలతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రాలేరన్నారు. రాష్ట్రంలో మరోసారి వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.