Minister Roja : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. రోజు రోజుకీ అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి అధికారంలోకి వస్తామని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధీమాగా చెబుతోంది. మరోవైపు టీడీపీ, జనసేన సైతం అధికారం తమదే అని ధీమాతో ఉన్నాయి. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని, ఏపీలో కూడా జగన్ అదేవిధంగా అధికారాన్ని కోల్పోతారని, ఏపీలో టీడీపీ, జనసేన ఉమ్మడిగా అధికారంలోకి వస్తాయని ఆ పార్టీల నేతలు జోస్యం చెబుతున్నారు.
ఇక గత కొద్ది రోజులుగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు సీట్ల పంపకాలపై చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నిన్న మొన్నటి వరకు జైల్లో ఉండడం వల్ల ఈ ప్రక్రియ ఆలస్యం అయింది. కానీ ఆయనకు బెయిల్ లభించడంతో ఎట్టకేలకు ఇరు పార్టీల నేతలు సీట్ల పంపకాలపై సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుంది, ఏయే స్థానాల్లో వారు పోటీ చేస్తారు అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ క్రమంలోనే మరోమారు బాబు, పవన్ సమావేశమై సీట్ల పంపకంపై చర్చించారు. అయితే దీనిపై మంత్రి రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
జనసేన, టీడీపీ అధికారంలోకి వస్తాయని కలలు కంటున్నాయని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. వారికి సీట్ల పంపకాల్లో ఇంకా స్పష్టత రాలేదని, అసలు ఇప్పటి వరకు ఉమ్మడి మ్యానిఫెస్టోను ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఏపీలో అసలు ఏయే స్థానాల్లో పోటీ చేయాలో వారు ఇంకా నిర్ణయించుకోలేకపోతున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కోసం హడావిడి పడుతున్నాయి తప్ప ప్రజలపై ప్రేమలేదని, వారు అధికారంలోకి రావడం అంతా భ్రమేనని అన్నారు. అలాగే ఆరోగ్య శ్రీ పథకంపై కూడా వారు అన్నీ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మంత్రి రోజా విమర్శించారు.
కాగా నగరి ఎమ్మెల్యేగా ఉన్న రోజాకు ఈసారి సీఎం జగన్ టిక్కెట్ ఇవ్వడం లేదని, అక్కడ ఆమెపై వ్యతిరేకత ఉందని, కనుకనే రోజా టిక్కెట్‌ను కోల్పోయారని ఇప్పటి వరకు టీడీపీ, జనసేన ప్రచారం చేశాయి. కానీ మంత్రి రోజా ఆ విమర్శలను కొట్టి పారేశారు. ఇంకా ఈ విషయంపై ఎటూ తేలలేదని, తనకే ఆ విషయం తెలియదని, టీడీపీ, జనసేనకు ఎలా తెలుసని ప్రశ్నించారు. వారు చెబుతున్నవన్నీ అసత్యాలేనన్నారు.