Minister KTR : ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ చేసిన ట్వీట్‌కు టీపీసీసీ చీఫ్ స్పందిస్తూ.. బీజేపీ దగ్గర శిష్యరికంతో ఈ డ్రామారావు ఫేక్ ప్రచారాల్లో రాటుదేలాడని, తెలంగాణలో కాంగ్రెస్ సునామి చూసి ఈ సన్నాసికి ఏం చేయాలో అర్థం కాక, ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి ఫేక్ ప్రచారాలకు దిగాడని విమర్శించారు. నిన్న మొన్నటి దాకా కర్ణాటకలో అధికారంలో ఉన్న వీళ్ళ మిత్ర పార్టీ బీజేపీ, 40 శాతం కమిషన్లతో రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించిందని, అలాంటి పరిస్థితుల్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ 100 రోజుల్లోపే ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసి, రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి వైపు నడిపిస్తోందన్నారు.
ఇప్పుడు తెలంగాణాలోనూ కాంగ్రెస్ దూసుకెళ్తుంటే, ఇన్ని రోజులు నింపుకున్న జేబులను ఇప్పుడు దులుపుతున్నారన్నారు. మీరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, కోట్లాది రూపాయలు కుమ్మరించినా, తెలంగాణ ప్రజలు మీ తోడు దొంగల దుమ్ము దులపడం ఖాయమని రేవంత్ అన్నారు. అయితే పీసీసీ రేవంత్‌రెడ్డికి జానారెడ్డి సంస్కారం నేర్పాలని.. కేసీఆర్‌కు పిండం పెట్టాలనుప్పుడు ఆయన సంస్కారం ఎక్కడికి పోయిందంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ జల విహార్‌లో బీఆర్‌ఎస్ ఇన్‌చార్జిలు, వార్‌రూమ్ సభ్యులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ తీరుపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతల వద్ద సంస్కారం నేర్చుకోవాలని ఖర్మ లేదని, రూ.50 కోట్లకు పీసీసీ పదవి అమ్ముకున్న దగుల్బాజీ పార్టీ కాంగ్రెస్ అంటూ విమర్శించారు.
పీసీసీ అధ్యక్షుడు డబ్బులు డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆ పార్టీ నేతలే ఈడీకి ఫిర్యాదు చేస్తున్నారన్నారు. గత ఎన్నికల కంటే బీఆర్‌ఎస్ అధిక స్థానాలు గెలుస్తుందని, ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల రణరంగంలో కిషన్‌రెడ్డి వెన్నుచూపి పారిపోయారని, బీజేపీకి 100, కాంగ్రెస్‌కు 40 స్థానాల్లో అభ్యర్థులు లేరన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు బీఆర్‌ఎస్‌తోనే ఉన్నారన్నారు. సోషల్ మీడియా ప్రభావం తెలియని నేతలు సైతం ఇంకా ఉన్నారని.. సోషల్ మీడియాతోనే మోదీ జాతీయస్థాయి ఎదిగారన్నారు. సీనియర్ పోలిటిషన్స్ ఇంకా కొత్త రకం ఎన్నికల విధానానికి అలవాటు పడలేదన్నారు.