Meena : టీడీపీ నాయకుడు బండారు సత్యనారాయణ ఇటీవల రోజాపై చేసిన కామెంట్స్ పొలిటికల్ హాట్ టాపిక్ అయ్యాయి. బండారుని పోలీసులు అరెస్ట్ చేయడం, ఆయన బెయిల్ పై బయటకు రావడం అంతా చకచకా జరిగిపోయాయి. అరెస్ట్ విషయంలో రెండు రోజులు హడావిడి జరిగినా, బెయిల్ మాత్రం సునాయాసంగానే వచ్చింది. అయితే ఇప్పుడు ఆయనపై విమర్శల దాడి పెరిగింది. సినీ ఇండస్ట్రీ నుంచి మంత్రి రోజాకి పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. రాజకీయాల్లో ఉన్న సినీతారలు ముందుగా రోజాపై బండారు వ్యాఖ్యలను ఖండించారు. కవిత, ఖుష్బూ, రాధిక.. ఘాటుగా స్పందించారు.
బండారుకి కఠిన శిక్ష పడాలన్నారు. తాజాగా ఎంపీ నవనీత్ కౌర్ కూడా ఈ ఘటనపై స్పందించారు. రమ్యకృష్ణ, మీనా కూడా బండారు వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.మీనా తీవ్రంగా స్పందిస్తూ.. ఓ మహిళా మంత్రిపై బండారు వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు. తన వ్యాఖ్యల పట్ల బండారు తక్షణమే మంత్రి రోజాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి రోజాపై బండారు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని మీనా కోరారు. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి ఇటీవల అరెస్టు చేయడం తెలిసిందే. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.
సినీ ఇండస్ట్రీ నుంచి వస్తున్న మద్దతును చూసి రోజా ఊరట చెందాలా, లేక సొంత పార్టీనుంచి సరైన స్పందన రాలేదని బాధపడాలా.. అర్థం కాని పరిస్థితి. ఇండస్ట్రీ జనాలు స్పందించినంత ఘాటుగా వైసీపీ నుంచి సరైన స్పందన లేదు అనేది వాస్తవం. కనీసం సహచర మహిళా ఎమ్మెల్యేలయినా రోజాకు మద్దతుగా నిలిచారా, ఆమెను కలసి ఓదార్చారా..? అంటే సరైన సమాధానం లేదు. మహిళా కమిషన్ కూడా నిస్సహాయంగా మారిపోయింది. బండారుని అరెస్ట్ చేయాలంటూ డీజీపీకి లేఖరాసి సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో రోజా.. జాతీయ మీడియా సపోర్ట్ కోరుతూ ట్వీట్ వేయడం విశేషం. సినీ ఇండస్ట్రీకి చెందిన మహిళా ఆర్టిస్ట్ లు బండారు సత్యనారాయణను నేరుగా టార్గెట్ చేస్తున్నారు. బండారుకి తల్లి, చెల్లి, భార్య లేరా అని ప్రశ్నిస్తున్నారు. అలాంటి వారికి కుటుంబ సభ్యులైనా బుద్ధి చెప్పాలని, క్షమాపణలు చెప్పించాలని అంటున్నారు.