Manchu Vishnu : సెలబ్రిటీలు అన్నాక అప్పుడప్పుడు నోరు జారడం సహజం. సమాజంలో జరుగుతున్న సంఘటనల మీదనో లేదంటే ఇతర సెలబ్రిటీల మీదనో వారు నోరు జారుతుంటారు. అనకూడని మాటలను అంటుంటారు. తరువాత నాలుక్కరుచుకుని.. సారీ.. నా ఉద్దేశం అది కాదు, నేను ఎవరినీ కించపరచాలని అలా అనలేదు.. అని సర్ది చెబుతారు. ఇవన్నీ సినిమా సెలబ్రిటీలకు మామూలే. సరిగ్గా ఇదే పరిస్థితిని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ఎదుర్కొంటున్నాడని చెప్పవచ్చు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ఈ మధ్యే కల్కి మూవీపై, అందులో నటించిన వారిపై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. కల్కి 2898ఏడీ మూవీ బాగుందని, అందులో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో ఆయన జీవించారని అర్షద్ వార్సీ అన్నాడు. అంతటితో ఆగకుండా మూవీ బాగున్నప్పటికీ అందులో ప్రభాస్ క్యారెక్టర్ తనకు ఏమాత్రం నచ్చలేదని, అతను ఆ మూవీలో ఒక జోకర్‌లా ఉన్నాడని కామెంట్ చేశాడు. దీంతో టాలీవుడ్ ఫ్యాన్స్ అందరూ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కొందరు టాలీవుడ్ నటులు కూడా ఈ విషయంపై స్పందించారు.
అర్షద్ వార్సీ నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు అతనికి హితవు పలికారు. అయితే మా అధ్యక్షుడు మంచు విష్ణు ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. దీనిపై ఆయన ఏకంగా సినీ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు పూనమ్ ధిల్లాన్‌కు లేఖ రాశారు. అర్షద్ వార్సీ తన అభిప్రాయాలను చెప్పవచ్చని, కానీ ఆయన ప్రభాస్ గురించి మాట్లాడిన మాటలు ఆక్షేపణీయమని అన్నారు. ఒక వ్యక్తిని కించ పరిచేలా అర్షద్ మాట్లాడాడని, ఎవరైనా మాటలు మాట్లాడే ముందు ఆచి తూచి మాట్లాడాలని.. మంచు విష్ణు ఆ లేఖలో స్పష్టం చేశారు.
ఈ సమాజంలో ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందని మంచు విష్ణు అన్నారు. విమర్శలు చేయడం కరెక్టే.. కానీ అవి ఎదుటి వారిని కించపరిచేలా ఉండవద్దని మంచు విష్ణు అన్నారు. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ.. ప్రభాస్‌పై ఇలాంటి కామెంట్లు చేయడం తగదని మంచు విష్ణు ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప మూవీని సొంతంగా తెరకెక్కిస్తున్న విషయం విదితమే. ఇందులో ఆయన కీలకపాత్రలో నటిస్తున్నారు. అలాగే ప్రభాస్, అక్షయ్ కుమార్ వంటి ప్రముఖ నటులు ఇందులో నటిస్తున్నట్లు ఈమధ్యే రిలీజ్ అయిన టీజర్‌ను చూస్తే స్పష్టమవుతుంది. ఇక ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.