Manchu Vishnu : మోహన్ బాబు నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు విభిన్న కథా చిత్రాలు చేస్తున్నా పెద్దగా రాణించలేకపోతున్నాడు. ఆయన సినిమాలలో చాలా సినిమాలు ఫ్లాప్స్‌గానే ఉన్నాయి. ఇక ఒక్కోసారి ఆయన సోషల్ మీడియాలో చేసే పోస్ట్‌లతో ట్రోల్స్ బారిన పడుతుంటాడు. అయితే తొలిసారిగా సోషల్ మీడియా లో తనపై, తన కుటుంబపై ట్రోలింగ్ చేస్తున్న వారిపై హీరో మంచు విష్ణు ఘాటుగా స్పందించారు. ట్రోల్స్ ఇకపై సహించేది లేదని.. టాలీవుడ్‌లో ఓ హీరోకు చెందిన కంపెనీ నుంచే తన కుటుంబంపై ట్రోలింగ్ జరుగుతోందని మంచు విష్ణు మండిపడ్డారు.
సదరు హీరో జూబ్లీహిల్స్‌లోని తన ఐటీ కంపెనీలో తన కుటుంబంపై ట్రోలింగ్ చేసేందుకు ఏకంగా 21 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని విష్ణు ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే తాను పూర్తి వివరాలు సేకరించానని విష్ణు తెలిపారు. ఆ హీరో నడుపుతున్న ఆఫీస్ చిరునామాతోపాటుగా వారు వినియోగించే ఐపీ అడ్రస్‌లను కూడా సేకరించానని తెలిపారు. త్వరలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమగ్ర ఆధారాలతో ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తనపైనా, తన కుటుంబంపైనా పని గట్టుకుని ట్రోలింగ్ చేస్తున్న వారిని వదిలి పెట్టేది లేదంటూ మండిపడ్డారు.
హీరో హీరోయిన్ల మధ్య గాసిప్స్ రావడం సహజమేనని అలాంటివి రాసుకోండి.. కానీ బతికున్నవారిని చంపేలాంటివి మానుకోండని హెచ్చరించారు. ట్రోల్స్ అందరినీ నవ్వించేవిగా ఉండాలి కానీ ఇలా ఎదుటివారు బాధపడేలా ఉండకూడదని చెప్పుకొచ్చాడు మంచు విష్ణు. మరి ఈ సారి ట్రోల్స్ పై విష్ణు సీరియస్‌గా స్పందించిన నేపథ్యంలో ఇప్పటికైన వాటికి చెక్ పడుతుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం విష్ణు జిన్నా సినిమాతో బిజీగా ఉన్నాడు.