గుర్తు తెలియని వ్యక్తులకు, ఇంటర్నెట్‌లో పరిచయం అయ్యేవారికి డబ్బు పంపవద్దని పోలీసులు ఎంత చెబుతున్నా కొందరు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. చాలా మంది ఇలా మోసపోతున్నా ఇంకా కొందరికి మాత్రం జ్ఞానోదయం కావడం లేదు. ఎవరో తెలియని వారికి డబ్బులు పంపుతూ లక్షల రూపాయలను పోగొట్టుకుంటున్నారు. సరిగ్గా అక్కడ కూడా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన 22 ఏళ్ల యువకుడు ఆన్‌లైన్‌లో ఓ వెబ్‌సైట్‌ను చూస్తుండగా.. కాల్ గర్ల్స్ సరఫరా చేస్తామంటూ ఓ ఫోన్ నంబర్ కనిపించింది. దీంతో ఆ నంబర్‌కు కాల్ చేశాడు. అవతలి వ్యక్తి తనను తాను కుమార్‌గా పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ స్టార్ హోటల్‌లో ముందుగా రూమ్ తీసుకోవాలని, అలాగే అమ్మాయి సేఫ్టీ, ఇతర ఖర్చుల కోసం కావాలని చెప్పి ఆ యువకుడి నుంచి విడతల వారిగా మొత్తం రూ.7.84 లక్షలను ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు. అయితే తరువాత ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది.
దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆ యువకుడు అక్కడి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆన్‌లైన్ లో ఇలా పరిచయం అయ్యేవారికి, గుర్తు తెలియని వారికి డబ్బులను అసలు పంపకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.