Mallu Bhatti Vikramarka : తెలంగాణ సీఎం ఎవరు అవుతారనే అనుమానాలు అందరిలో ఉండగా, దానికి ఎట్టకేలకి ఓ క్లారిటీ వచ్చింది. రేవంత్ రెడ్డిని తెలంగాణ సీఎంగా ఎంపిక చేయగా, సీనియర్ నాయకుడు భట్టి విక్రమార్కని డిప్యూటీ సీఎంగా ఆఫర్ ఇచ్చారు . కాంగ్రెస్ కీలక నేత, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క మధిర నుండి మరో సారి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజ్‌పై 35,190 ఓట్ల తేడాతో భట్టి గెలుపొందారు. సీఎం పదవి ఇస్తే భాద్యతతో పని చేస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే భట్టికి సీఎం ఆఫర్ దక్కుతుందని అందరు అనుకున్నా,అది జరగలేదు. ఈ విషయంలో భట్టిని మీడియా ప్రశ్నించారు.
డీకే శివకుమార్‌ని కలిసినప్పుడు ఆయన ఏమన్నారు, మీకు అవకాశం ఎందుకు ఇవ్వలేదు అని భట్టిని ప్రశ్నించగా, దానికి భట్టి మాట్లాడుతూ ఆ విషయాలు తర్వాత మాట్లాడతానని అన్నారు. ఇక తమని గెలిపించిన ప్రతి ఒక్కరికి భట్టి కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ నాయకులకి కూడా భట్టి ధన్యవాదాలు తెలియజేశారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాపై భట్టి మాట్లాడారు. రైతులకు ఉచిత విద్యుత్ అనే పథకం అనగానే మొట్టమొదట గుర్తుకొచ్చేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరేనని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం అమలు ఫైలుపై సంతకం చేశారని గుర్తు చేశారు. దీనిపై కాంగ్రెస్‌కు మాత్రమే పెటెంట్ ఉందని చెప్పారు.
రాష్ట్రంలో డిమాండ్‌కు తగ్గ విద్యుత్ ఉత్పత్తి కావడానికి కూడా వైఎస్సార్ కారణమని భట్టి అన్నారు. ఆయన హయాంలో తెలంగాణలో నిర్మితమైన ప్రాజెక్టుల వల్లే ఇప్పుడు కరెంట్ వస్తోందని చెప్పారు. కాంగ్రెస్ అంటే కరెంట్, కరెంట్ అంటే కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. కరెంట్‌ను ముట్టుకున్నా, కాంగ్రెస్‌ను ముట్టుకున్నా ఎలా మాడిపోతారో ఇప్పుడు చూశారు కదా? అని అన్నారు. మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో పాదయాత్ర చేశానని, గ్రామస్థాయిలో ప్రజల కష్టాలు ఎలా ఉంటాయనేది ప్రత్యక్షంగా చూశానని భట్టి పేర్కొన్నారు.