Mallareddy : బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం నుండి తప్పుకున్న తర్వాత ఆ పార్టీకి చెందిన నాయకులని కాంగ్రెస్ ప్రభుత్వం వణుకు పుట్టిస్తుంది. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఇటీవల షాకుల మీద షాకులు ఇస్తుంది. భూమిని ఆక్రమించి రోడ్డు వేశారని ఆయనకి చెందిన కాలేజీ రోడ్డును తొలగించగా.. గురువారం ఆయన అల్లుడి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీకి చెందిన భవనాలను కూల్చేశారు. హైదరాబాద్ శివారు దుండిగల్ లోని చిన్న దామరచెరువు ఎఫ్ టీఎల్ బఫర్ జోన్ లో ఆయనకు చెందిన ఏరోనాటికల్, ఎంఎల్ఆర్ఐటీఎం కళాశాలలకు సంబంధించిన 2 శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్లను కూల్చేశారు.
దుండిగల్ ఎంఎల్‌ఇఆర్‌టి కాలేజీని చిన్న దామర చెరువులో నిర్మించినట్టు ఆరోపణలు ఉన్నాయి. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కాలేజీపై చర్యలు తీసుకోడానికి అధికారులు సాహసించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలను చేపట్టిన వారిపై కఠిన చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చిన్నదామర చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారనే అభియోగాలతో భవనాలను కూల్చివేశారు. మేడ్చల్, దుండిగల్ ప్రాంతంలోని బఫర్ జోన్ నిర్మాణాలను తొలగించారు.
8.24 ఎకరాల చెరువును ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు వారం క్రితం యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. తాజాగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపట్టారు. ఈ క్రమంలో మల్లారెడ్డి… సీఎం సలహాదారును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా… రాజశేఖర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలలో అక్రమ నిర్మాణాలు జరిగాయని చెబుతూ వాటిని అధికారులు కూల్చేస్తున్న నేపథ్యంలో.. వీరిద్దరూ సీఎం సలహాదారుని కలిశారనే కథనాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.