Malla Reddy : తెలంగాణ ఎన్నికలు ఎంత రసవత్తరంగా మారాయో మనం చూశాం. ఎవరు ఊహించని విధంగా కాంగ్రెస్ గెలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే కొన్ని ఏరియాలలో బీఆర్ఎస్ నాయకులు కూడా మంచి విజయాలని సాధించారు. వారిలో మల్లారెడ్డి ఒకరు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి ఘన విజయం సాధించడంతో ఆయనకు మేడ్చల్, గుండ్లపోచంపల్లి, మండలంలోని పలు గ్రామాలకు చెందిన నేతలు నగరంలోని బోయిన్‌పల్లిలోని ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంటికి వెళ్లి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలో అత్యధిక ప్రాంతాల్లో గులాబీ పార్టీకి ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ ఆయన మేడ్చల్ నియోజకవర్గం నుంచి విజేతగా నిలిచారు. మల్లారెడ్డి దాదాపు 9 వేల ఓట్ల ఆధిక్యంతో సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. అయితే గెలిచాక మల్లారెడ్డి మాట్లాడుతూ.. గెలుపోటములు అందరికి సహజం. ప్రజలు కాంగ్రెస్‌ని ఆశీర్వదించారు. వారికి కూడా ఓ ఛాన్స్ ఇవ్వాలి కదా అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది కదా, మరి అటు వెళతారా అంటే ఓ రకమైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. తనకు రాజకీయాలలో ఎక్స్పీరియన్స్ అంతగా లేదని, సడెన్ గా ఎంపీ అయ్యాను, మంత్రి అయ్యాను, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటాను. అది కూడా చూద్దాం ఎలా ఉంటుందో అని అన్నాడు మల్లారెడ్డి.
ఇక ఇదిలా ఉంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశానికి హాజరు కాకపోవడంపై క్లారిటీ ఇచ్చారు మల్లారెడ్డి. ఉద్దేశపూర్వకంగానే మల్లారెడ్డి హాజరుకాలేదంటూ జరిగిన ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో వివరణతో ఓ పోస్టు పెట్టారు. తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలను బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు నమ్మొద్దన్నారు మల్లారెడ్డి. ఇలాంటి వార్తలను పూర్తిగా ఖండిస్తున్నానని చెప్పారు. పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు మల్లారెడ్డి. ఆల్వేస్ విత్ కేసీఆర్ అంటూ హ్యాష్ ట్యాగ్ జోడించారు.