Mahmood Ali : మరికొద్ది రోజులలో తెలంగాణ ఎలక్షన్స్ తరుముకొస్తున్న నేపథ్యంలో అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఈ సారి తెలంగాణ, కాంగ్రెస్ మధ్య పోటీ భారీగా ఉంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ తన వ్యక్తిగత సహాయకుడు, గన్‌మెన్ అయిన కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించారు. మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతుండగా ఈ ఘటన జరిగింది. వివరాల్లోకెళితే.. మంత్రి తలసాని జన్మదినం సందర్భంగా మంత్రి మహమూద్ అలీ ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు.
ఆ సమయంలో బోకే ఎక్కడ అంటూ తన సెక్యూరిటీ సిబ్బందిని అడిగారు. అయితే బోకే గురించి తెలియదని సిబ్బంది చెప్పడంతో సహనం కోల్పోయిన హోంమంత్రి మహమూద్ అలీ కానిస్టేబుల్‌ను చెంప దెబ్బ కొట్టారు. దీంతో షాక్ అయిన సదరు గన్‌మెన్ మంత్రిని అలాగే చూస్తుండిపోయారు.ఆకస్మిక ఘటనతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ క్రమంలో మంత్రి తలసాని.. మహమూద్ అలీకి సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. తరువాత వెనకాల ఉన్న వ్యక్తుల దగ్గరి నుంచి బొకే తీసుకుని మంత్రికి అందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహమూద్ అలీ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హోం మంత్రి మహమ్మద్ అలీ తన భద్రత సిబ్బంది పై చేయి చేసుకున్న ఘటన పై బిజేపి ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు అధికార అహంకారంతో విర్రవీగుతున్నారని మండిపడ్డారు. రక్షణ కల్పించే భద్రత సిబ్బంది పై హోంమంత్రి మహమ్మద్ అలీ చేయి చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఇది వారి అహంకారానికి నిదర్శనమన్నారు. మహమ్మద్ అలీ భద్రత సిబ్బంది పై చేయి చేసుకుంటున్న వీడియోను చూపిస్తూ.. అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆయన హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.