Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను హీరోగా నిరూపించుకుంటున్నాడు. శ్రీమంతుడు చిత్రంలో ఒక ఊరిని దత్తత తీసుకుని ఆ ఊరి రూపు రేఖలను మార్చి ఎంతో అందంగా, సౌకర్యవంతంగా స్కూళ్లు, హాస్పిటల్స్ ఇలా అన్ని వసతులను తీర్చి దిద్దిన మహేష్, తన నిజ జీవితంలో కూడా రెండు గ్రామాలను దత్తత తీసుకొని వాటి అభివృద్ధి కొరకు తనవంతు కృషి చేస్తూనే ఉన్నారు. బుర్రెపాలెం, మరియు సిద్దాపూర్ అనే రెండు గ్రామాల అభివృద్ధికి అలాగే గ్రామ ప్రజల సంక్షేమాన్ని ఇలా ప్రతి ఒక్క అవసరాన్ని మహేష్ చూసుకుంటున్నాడు.
మరోవైపు ఆంధ్ర హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఎందరో చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నారు. గుండె సంబంధిత జబ్బులతో బాధపడుతూ ఆర్థిక సహాయం కోసం ఎదురు చూసే ఎందరో చిన్నారులకు నేనున్నానంటూ ముందుకొచ్చి వారి ఆపరేషన్ కి అయ్యే ఖర్చు అంతా కూడా మహేష్ భరిస్తున్నాడు. ఇప్పటి వరకు అలా ఎందరో చిన్నారులకు ప్రాణం పోసిన మహేష్ తాజాగా మరో చిన్నారికి రూ. 5లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు.
రీసెంట్‌గా తన తండ్రి చనిపోయి పుట్టెడు దుఖంలో ఉన్న సమయంలో కూడా మహేష్ బాబు.. ఓ చిన్నారికి హార్ట్ సర్జరీ చేయించి.. పెద్ద మనసు చాటుకున్నాడు. ఇక తాజాగా మరో చిన్నారి గుండె ఆపరేషన్‌కు ఆర్థిక సాయం చేసి.. ఆ చిన్నారికి పునర్జన్మను ప్రసాదించాడు సూపర్ స్టార్. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలంలోని గూడా సిర్సన్న గ్రామానికి చెందిన 10 నెలల చిన్నారి కనకాల వర్ష పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. స్టార్ హాస్పిటల్ ద్వారా ఈ చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న మహేష్ బాబు.. తన ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫాండేషన్ ద్వారా రూ.5 లక్షల ఆర్ధిక సాయం చేశాడు. చిన్నారికి విజయవంతంగా ఆపరేషన్ జరగడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. తమ బిడ్డకు పునర్జన్మ ప్రసాదించిన మహేష్ బాబుకి చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.