KTR : అసెంబ్లీలో రాజకీయం మరింత రంజుగా మారుతుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. సభలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. సభలో అధికార పక్షం నేతలు వాడుతున్న భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేతలు.. నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. వాకౌట్ చేసి నేరుగా మీడియా పాయింట్ వద్దకు వెళ్దామనుకున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అయితే ప్రస్తుతం హాట్ హాట్‌గా జరుగుతున్న అసెంబ్లీలో కేటీఆర్ కూడా పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
తెలంగాణ మంత్రులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఫైర్ అయ్యారు. మంత్రులు తమ పార్టీ ఎమ్మెల్యేలను దూషించడానికే అసెంబ్లీకి వచ్చినట్లుందని అన్నారు. భాష కూడా సక్రమంగా లేదని కేటీఆర్ అన్నారు. తాము గెలిచి ఏం చేస్తామో చెప్పకుండా, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేవలం ప్రత్యర్థి పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ కేటీఆర్ మండి పడ్డారు. ముందు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను, వాగ్దానాలను, గ్యారంటీలను అమలు చేసి చూపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. అంతే తప్ప అభివృద్ధిని, సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం బీఆర్ఎస్ పై బురద జల్లే విధంగా అసెంబ్లీని నడపటం ప్రజలందరూ చూస్తున్నారన్నారు.
మేడిగడ్డకు పోయి కూలిపోయిందంటూ తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని, దానిని బాగు చేయాలన్న స్పృహ కూడా లేదని కేటీఆర్ మండి పడ్డారు. అసెంబ్లీ సమావేశాలను పెట్టుకున్నది బడ్జెట్ పై చర్చించేందుకు మాత్రమేనని, బీఆర్ఎస్ పై విమర్శలు చేయడానికి కాదన్న విషయం గుర్తుంచుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీని చిట్ చేసి నాశనం చేసిన చీడపురుగే రాజగోపాల్ రెడ్డి అని కడియం తీవ్ర ఆరోపణలు చేశారు. కడియం శ్రీహరిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని కేటీఆర్ సైతం డిమాండ్ చేశారు.మరోవైపు.. నల్గొండ సభలో కేసీఆర్ మాట్లాడిన భాషపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు రాకుండా కేసీఆర్ పారిపోయారన్నారు. కాళేశ్వరం, గోదావరి జలాలపై చర్చకు తాము సిద్దమని.. కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే సభకు వచ్చి చర్చ చేయాలన్నారు.