CM YS Jagan : ఇటీవల ముగిసిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ శతవిధాలా కృషి చేస్తోంది. అయితే ఈ విషయం ఇలా ఉంచితే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఓడిపోయినప్పటికీ ప్రజల పక్షాన ఉంటామని, అధికార పార్టీపై ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తామని చెప్పింది. అంతేకానీ ఎలాంటి ఆందోళన పడుతున్నట్లు కనిపించలేదు. అయితే బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మాత్రం తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య విషయంలో తీవ్ర ఆందోళన ఉన్నట్లు తెలుస్తోంది.
మాజీ సీఎం కేసీఆర్ ఈ మధ్యే తుంటి విరగడంతో ఆపరేషన్ చేయించుకుని ప్రస్తుతం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ నందినగర్‌లో ఉన్న తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. మరోవైపు ఆయనకు ఇంకో తుంటి కూడా సమస్య వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది. కానీ కేసీఆర్ మాత్రం ఇది వరకు యాక్టివ్‌గా లేరని తెలుస్తోంది. ఆయన ఆరోగ్యంపై అటు కేటీఆర్‌తోపాటు బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ ఆందోళన నెలకొంది. ఇప్పటికే అనేక మంది ఆయనను పరామర్శించారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కేసీఆర్‌ను పరామర్శించారు.
కేసీఆర్‌ను తన నివాసంలో కలిసిన సీఎం జగన్ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. అయితే కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లిన జగన్‌ను కేటీఆర్ రిసీవ్ చేసుకున్నారు. ఆ సమయంలో కేటీఆర్ ఒకింత ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి కేసీఆర్ పరిస్థితి తలచుకుని తీవ్ర విచారంతోనే కేటీఆర్ మనస్థాపం చెందినట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్‌కు ఇప్పటికిప్పుడు వచ్చే ముప్పు ఏమీ లేకపోయినా ఆయన ఆరోగ్యంపై మాత్రం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కానీ కొందరు మాత్రం ఆయన త్వరగా కోలుకుంటారని, ఆయన ఉక్కులాంటి మనిషని అంటున్నారు. ఇక కేసీఆర్ మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి ఎప్పుడు వస్తారో వేచి చూస్తే తెలుస్తుంది.