Komatireddy Venkat Reddy : బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. ప్రజాపాలన సభలో తన పక్కనే కూర్చుకున్న జడ్పీ ఛైర్మన్‌ను తన మాటలతో అవమానించటమే కాకుండా.. బయటకు గెంటెయాలని పోలీసులకు హుకూం జారీ చేయటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా గూడురులో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవన ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి కాలిగోటికి కూడా కేటీఆర్ సరిపోరంటూ విమర్శించారు. కేసీఆర్ ఎమ్మెల్యే అయితే.. తన తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చారని.. కానీ తాము ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఈ స్థాయికి వచ్చామన్నారు. అలానే వేదికపై తన పక్కన కూర్చున్న జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గురించి కూడా ప్రస్తావిస్తూ.. ఎలిమినేటి మాధవరెడ్డి ఓ మహానాయకుడని, ఆయన పేరు చెప్పుకుని జడ్పీటీసీ అయ్యాడు తప్ప.. ఆయన సర్పంచ్‌గా కూడా పనికిరాడంటూ.. తక్కువ చేసి మాట్లాడారు.
అప్పటివరకు.. కేటీఆర్‌ను విమర్శించినప్పటికీ ఓపికతో సహించిన సందీప్ రెడ్డి.. తనను కూడా వ్యక్తిగతంగా కించపర్చటంతో ఒక్కసారిగా పైకి లేచి.. ఏం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమంలో ఇలాంటివి మాట్లాడటం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో.. కోపగించుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. అక్కడే ఉన్న పోలీసులను పిలిచి.. ఇతన్ని బయటకు వెళ్లగొట్టండయ్యా అంటూ హుకూం జారీ చేశారు. ఇంకేముంది.. మంత్రి ఆదేశాలతో పోలీసులు సందీప్ రెడ్డిని బలవంతంగా వేదిక నుంచి కిందికి దింపేశారు. ఈ క్రమంలోనే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల హోరాహోరి నినాదాలతో సమావేశం ఉద్రిక్తతంగా మారింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరంకుశ వైఖరిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యాదాద్రి భువనగిరి జెడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డిపై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిపై ప్రజలు, బీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. మంగళవారం ఎక్కడిక్కడ మంత్రి దిష్టి బొమ్మలను తగులబెట్టి ఆందోళన చేపట్టారు.