Komatireddy Rajagopal Reddy : అసెంబ్లీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఎంత వాడి వేడి డిస్కషన్ జరుగుతుందో మనం చూశాం. తెలంగాణలో విద్యుత్ రంగంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మధ్య వాడీ వేడీ చర్చ జరిగింది. ముందుగా యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఇందులో 10 వేల కోట్లను జగదీశ్ రెడ్డి తిన్నారని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగదీశ్ రెడ్డి ధీటుగా స్పందించారు . ముందుగా కోమటిరెడ్డి మాట్లాడుతూ, ఫ్రీ కరెంట్ పెటెంట్ కాంగ్రెస్ దే అని అన్నారు . బీఆర్ఎస్ నేతలకు ట్రాన్స్ కో, జెన్ కో మాజీ చైర్మన్ ప్రభాకర్ రావు దోచిపెట్టారన్నారు.
విద్యుత్ రంగంలో అవకతవకలపై విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. దొంగలు, అవినీతి అంటే భుజాలు తడుముకుంటున్నారన్నారు. ఎవరు ఎంత తిన్నారో అంత కక్కిస్తాం.. వదిలేస్తామా అన్నారు. టెండర్ లేకుండా పవర్ ప్లాంట్ పెట్టారన్నారు. బీఆర్ఎస్ 24 గంటల విద్యుత్ ఇచ్చిందనేది పచ్చి అబద్ధమన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌లో రూ.20వేల కోట్ల స్కాం జరిగిందన్నారు. ఇందులో జగదీష్ రెడ్డి రూ.10వేల కోట్లు తిన్నారన్నారు.దీనిపై స్పందించిన జగదీష్ రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. మధ్యలో కలుగజేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ స్కాంలపై జ్యూడీషియల్ ఎంక్వైరీకి ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు.
ఇక ఈ మధ్యలో కలుగజేసుకున్న రాజగోపాల్ రెడ్డి తాను పార్టీ మారానంటూ అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు. బీఆర్ఎస్ త్వరలో కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇక ఆ పార్టీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడన్నారు. తాను ప్రజల కోసమే పార్టీ మారానని, ఒక పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మాత్రమే మరో పార్టీలో చేరానని స్పష్టం చేశారు. అలాంటప్పుడు తాను పార్టీ మారానంటూ ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకునేది లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ సభ్యులు నిత్యం పార్టీ మార్పుపై విమర్శలు చేస్తున్నారని.. అసలు జగదీశ్ రెడ్డికి వేలాది కోట్ల రూపాయల బంగ్లాలు ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ అహంకారం చూసిన ప్రజలు ఆ పార్టీని ఓడించి బుద్ధి చెప్పారన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీకి ఇంకా బుద్ధి రాలేదని, అందుకే తమను పార్టీ మారినట్లు పదేపదే అంటున్నారని విమర్శించారు.