Kethireddy Venkatarami Reddy : ఏపీలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత అసలు జగన్ పాలనలో ఏం జరిగింది అన్నది ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీలో కొందరు జగన్ పరిపాలనని తప్పు పడుతూ ఆయన ఎమ్మెల్యేలకి కనీసం గౌరవం ఇవ్వలేదని అందుకే ఏపీలో వైసీపీ ఘోర ఓటమి చెందిందని అని వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. రీసెంట్‌గా రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సీఎం ని కలవాలని ఆఫీసుకు వెళితే, సీఎంఓలో ఏం జరిగేదో పూస గుచ్చినట్టు చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ని కలవడానికి వెళ్లిన ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉండేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయనను ఊహల్లో ఉంచారని, ధనుంజయ్ రెడ్డి లాంటి చెత్త అధికారి సీఎం లా వ్యవహరించే వాడని జక్కంపూడి రాజా మండిపడ్డారు.
జగన్ కు ఏ విషయం చెప్పాలి అన్న, ఫైల్ ఇవ్వాలి అన్న ధనుంజయ్ రెడ్డి రూమ్ బయట ఉదయం నుంచి రాత్రి వరకు ఎమ్మెల్యేలు నిలబడి పడిగాపులు కాయాల్సి వచ్చేదని ఆరోపించారు. ఇక తాజాగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి జక్కంపూడి రాజా బాటలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంఓలో ఎవడెవడో కూర్చొని గంటలు గంటలు మాట్లాడుతుంటారని, ఎమ్మెల్యేలకు, మంత్రులకు కలవడానికి మాత్రం అవకాశం ఇవ్వరని ఆరోపించారు. జగన్ కు, ఎమ్మెల్యేలకు మధ్య ఓ గ్యాప్ ఉంది. సీఎం చాంబర్ బయట చాలాసార్లు మంత్రులు, ఎమ్మెల్యేలు పడిగాపులు కాయడం చూశాను. లోపల ఎవడో కూర్చుని మాట్లాడుతుంటాడు.
బయట వేచిచూస్తున్న వాళ్లు తమ బాధను ఎవరితోనూ చెప్పుకోలేరు, అలాగని గొడవపడలేరు. ముఖ్యమంత్రికి, ప్రజాప్రతినిధులకు మధ్య సీఎంవో వాళ్లు ఓ గ్యాప్ ను సృష్టించారు. దాంతో ప్రజాప్రతినిధులు సమస్యలను నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి లేకపోయింది. నన్నే ఉదాహరణగా తీసుకుంటే… ధర్మవరంలో ఓ ఫ్లై ఓవర్ భూసేకరణ కోసం 100 సార్లు సీఎంవో చుట్టూ తిరిగాను. ఒక గుంతలు పడిన రోడ్డు కోసం 40-50 సార్లు తిరిగుంటాను. అవేమన్నా మా ఇంట్లో పనులా… ప్రజలకు సంబంధించిన పనులు. మేం వాళ్ల వెంటపడి తిరగాల్సి వచ్చేది. దీని వల్ల నష్టపోయింది ఎవరు? సీఎంవోకు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ వల్లే ఓడిపోయాము అని చెప్పను కానీ.. ముఖ్యమంత్రితో ఎమ్మెల్యేల సంబంధాలను మాత్రం సీఎంవో వాళ్లు చెడగొట్టగలిగారు అని కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.