Keshava Rao : కే కేశవరావు, కడియం శ్రీహరి గత పదేండ్లు పార్టీలో అనేక పదవులు అనుభవించి ఇవాళ పార్టీ నుంచి జారుకున్నారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటానని చెప్పి ఇవాళ కాసాని జ్ఞానేశ్వర్ ముందుకు వచ్చారు. అవకాశం ఇస్తే చేవెళ్లలో నేను నిలబడుతానని చెప్పారు. దీంతో కేసీఆర్ ఆయనకు అవకాశం కల్పించారు. కాసాని ధీరోదాత్తమైన నాయకుడు. బలహీన వర్గాల ముద్దుబిడ్డ, బడుగుల ఆశాజ్యోతి అని చాలా మంది అనేక ప్రసంగాలు ఇచ్చారు.
కష్టకాలంలో మన కోసం వచ్చిన కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి. మన కష్టంలో ఉంటే పెద్ద పెద్ద నాయకులు కే కేశవరావు, కడియం శ్రీహరి పార్టీ నుంచి జారుకుంటున్నారు. ఈ సమయంలో ధీరోదాత్తంగా నిలబడి నేనున్నా అంటూ ముందుకు వచ్చిన నాయకుడిని కడుపులో పెట్టుకోవాల్సిన బాద్యత మనపై ఉంది. చేవెళ్లలో నిలబడ్డది కేసీఆర్.. అనుకొని కొట్లాడుదాం. ఆయన కోసం ఓటేస్తాం అనే కమిట్‌మెంట్‌తో పని చేద్దాం. పదేండ్లు పదవులు అనుభవించిన తర్వాత.. పోయేవాళ్లు రెండు రాళ్లు వేసి పోతారు. అది వారి విజ్ఞతకే వదిలేద్దాం.. కాలమే సమాధానం చెప్తుందని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ మాటలకి స్పందించిన కేశవరావు.. 85 ఏళ్లున్న తాను 55 ఏళ్లు కాంగ్రెస్‌లో పని చేశానని అన్నారు. సీడబ్య్లూసీ మెంబర్‌గా, నాలుగు రాష్ట్రాల ఇన్‌చార్జిగా కాంగ్రెస్ తనకు చాలా ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తుచేసుకున్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ కొంత ఆలస్యం చేయడం వల్ల ఆ పార్టీతో తనకు కొంత తేడా వచ్చిందని కేశవరావు చెప్పారు. తన కొడుకు విప్లవ కుమార్ కోరిక మేరకు ఆనాడు టీఆర్ఎస్‌లో చేరినట్లు చెప్పారు. చాలా బాధతో తాను ఆనాడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చానని అన్నారు. పాటలు, ధర్నాల వల్లనో తెలంగాణ రాలేదన్నారు. పార్లమెంట్‌లో ఫైట్ చేయడం వల్ల తెలంగాణ వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ఓటమికి కేసీఆర్ కారణం తెలుసుకోని.. పార్టీని సరి చేసుకోవాలని చెప్పారు. ఆయన కుటుంబం పార్టీని నడుపుతుందన్న మెసేజ్ ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీని దెబ్బతీసిందని చెప్పారు. యువకులను ముందు పెట్టీ బీఆర్ఎస్ పార్టీని నడిపించాలని చెప్పారు. 13 ఏళ్ల తీర్థయాత్ర తర్వాత తాను తిరిగి సొంత ఇంటికి చేరుకునే సమయం వచ్చిందని వివరించారు. తన కూతురు రేపు(శనివారం) కాంగ్రెస్‌లో చేరుతున్నారని కేశవరావు ప్రకటించారు.